నంబర్ ఫిఫ్టీ...జగన్ కి ప్లస్సా మైనస్సా ?
నంబర్ ఫిఫ్టీ అంటే ఒక అంకె కాదు, రాజకీయంగా ఒక తులాబారం. అధికారాన్ని దగ్గర చేసే దారం, ఆధారం.
నంబర్ ఫిఫ్టీ అంటే ఒక అంకె కాదు, రాజకీయంగా ఒక తులాబారం. అధికారాన్ని దగ్గర చేసే దారం, ఆధారం. ఇంతకీ ఈ యాభై నంబర్ విశేషం ఏంటి అంటే అదే అసలు కధ అని చెప్పాల్సి ఉంటుంది. ఇపుడు 2024లో అంతా ఉన్నారు. 2029లో ఎన్నికల నాటికి ఏపీలో అసెంబ్లీ సీట్లలో భారీ మార్పులు వస్తాయి.
ప్రస్తుతం ఉన్న 175 అసెంబ్లీ సీట్లకు ప్లస్ 50 సీట్లు కలుస్తాయి. అంటే టోటల్ గా 225 సీట్లు అన్న మాట. ఒక విధంగా ఇది ఎన్నికల్లో పోటీ చేసే ఆశావహులకు ఎగిరి గంతేసే వార్త. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అపుడు జరుగుతుంది. అంటే కొత్తగా మరో యాభై సీట్లు వచ్చి కోరినంత మందికి టికెట్లు ఇవ్వవచ్చు.
మరి ఇది వైసీపీకి జగన్ కి ఎంత వరకూ ప్లస్ అంటే దాని మీదనే రకరకాలైన విశ్లేషణలు సాగుతున్నాయి. ఇలా సీట్లు పెరిగినపుడు ఎపుడూ అది అధికార పార్టీకే లాభంగా ఉంటుంది. ఎందుకంటే అధికార పార్టీకి ఒత్తిడి విపరీతంగా ఉంటుంది. ఎంతో మంది టికెట్లు ఆశిస్తారు. దక్కకపోతే వారు తిరుగుబాటు బావుటా ఎగరవేస్తారు. అయిదేళ్ళు పవర్ లో ఉంటారు కాబట్టి వారి ప్రభావం సైతం గణనీయంగా ఉంటుంది.
అలాంటి వారికి టికెట్లు ఇచ్చుకోవడం ద్వారా అసంతృప్తిని పొగోట్టుకోవడంతో పాటు వీలైనంత ఎక్కువ సీట్లు సాధించుకునే అవకాశం అధికార పార్టీకి ఉంటుంది. ఇక నియోజకవర్గాల పునర్విభజన తో అడ్వాంటేజ్ ని అధికార పార్టీయే ఎంజాయ్ చేస్తుంది. తమకు నచ్చిన విధంగా నియోజకవర్గాలను మార్చుకుని కంచు కోటలను రెండుగా విభజించి వీక్ గా ఉన్న సీట్లలోనూ గెలిచేందుకు ఆ ఓట్లను కలుపుకుంటుంది.
అంతే కాదు విపక్షం బలంగా ఉన్న చోట అడ్డంగా నియోజకవర్గాని విభజించి వారికి విజయావకాశాలు లేకుండా చేయవచ్చు. ఎస్సీ ఎస్టీ రిజర్వుడు సీట్లను కూడా మార్చడం ద్వారా వారికి షాక్ తినిపించవచ్చు. ఇలా అధికారంలో ఉన్న పార్టీకి ఇది భారీ రాజకీయ లాభంగా ఉంటుంది.
ఇక వైసీపీకి మాత్రం ఈ సీట్ల పెరుగుదల కొంత ఇబ్బందే అని అంటున్నారు. మొత్తం 175 మంది అభ్యర్ధులను దగ్గర ఉంచుకుని వారితో పార్టీని అయిదేళ్ల పాటు నడిపించడమే కష్టం అవుతుంది విపక్షంలో. అలాంటిది మరో యాభై సీట్లు పెరిగితే సమర్ధులు అయిన అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం ఆయా నియోజకవర్గాలను కూడా అన్ని విధాలుగా బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగడం కత్తి మీద సాము లాంటి వ్యవహారం అని అంటున్నారు.
అదే విధంగా విపక్షంలో ఉన్న పార్టీలోకి ఎవరూ పెద్దగా రారు.బలమైనవారు అంతా అధికార పక్షం వైపు ఉంటారు. అక్కడ అసంతృప్తి ఉంటేనే ఈ వైపు చూస్తారు. కొత్తగా యాభై సీట్లు వస్తే ఆ అసంతృప్తి అధికార పార్టీ గేటు కూడా దాటదు. దాంతో కొత్త వారిని తయారు చేసుకుని అధికార పార్టీకి ధీటుగా రంగంలోకి దింపి గెలిపించుకోవడం అంటే పెను సవాల్ లాంటిది.
అయితే ప్రజలలో కనుక సానుకూలత ఉంటే గెలుపు గుర్రంగా ఆనాటికి పార్టీ మారితే ఈ సమస్యలు అన్నీ దూది పింజలుగా ఎగిరిపోతాయి. అలా పార్టీ తయారు కావాలీ అంటే ఇప్పటి నుంచే జనంలో ఉంటూ పార్టీని పటిష్టం చేసుకోవాలి. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకోవాలి. నాయకులకు క్యాడర్ కి తాను అందుబాటులో ఉంటూ పార్టీ పట్ల విశ్వాసం ఉండేలా చూసుకోవాలి. అపుడు యాభై సీట్లు ప్లస్ అవుతాయి. మొత్తానికి 225 అసెంబ్లీ సీట్లకు వైసీపీ అభ్యర్థులను మరో రెండేళ్ల తరువాత నిర్ణయించుకుని 2029 ఎన్నికలకు సిద్ధం కావాల్సి ఉంటుంది.దానికి సరిపడా యాక్షన్ ప్లాన్ ని మాత్రం ఈ రోజు నుంచే రూపొందించాల్సి ఉంది.