అసంతృప్తులను లెక్కచేయటంలేదా ?

వైసీపీలో టికెట్ల గందరగోళం రోజురోజుకు పెరిగిపోతోంది. ఇప్పటివరకు ప్రకటించిన 51 టికెట్లలో 24 మంది సిట్టింగులకు జగన్మోహన్ రెడ్డి టికెట్లు నిరాకరించారు.

Update: 2024-01-19 04:31 GMT

వైసీపీలో టికెట్ల గందరగోళం రోజురోజుకు పెరిగిపోతోంది. ఇప్పటివరకు ప్రకటించిన 51 టికెట్లలో 24 మంది సిట్టింగులకు జగన్మోహన్ రెడ్డి టికెట్లు నిరాకరించారు. అలాగే కొందరు ఎంపీలకు కూడా టికెట్లు నిరాకరించారు. విషయం ఏమైనా టికెట్లు దక్కని ఎంఎల్ఏలు, నియోజకవర్గాలు మారుతున్న మంత్రులు, ఎంఎల్ఏలు కొందరిలో అసంతృప్తి ఉన్నట్లు అర్ధమవుతోంది. జగన్ ఆదేశాలను పాటించాలి కాబట్టి కొందరు నియోజకవర్గాలు మారుతున్నారే కాని పూర్తిగా కన్వీన్సయి, ఇష్టపడి కాదని అర్ధమవుతోంది.

ఇలాంటి మంత్రులు, ఎంఎల్ఏలకు కొత్త నియోజకవర్గాల్లో నేతలు, క్యాడర్ ఏ విధంగా సహకరిస్తారు ? కొత్త అభ్యర్ధులకు నేతలు, క్యాడర్ పూర్తిగా సహకరిస్తారని జగన్ కూడా ఎలాగ అనుకుంటున్నారో అర్ధంకావటంలేదు. టికెట్ల నిరాకరణకు లేదా నియోజకవర్గాల మార్పునకు తాను చేయించుకుంటున్న సర్వే రిపోర్టులే కారణమని జగన్ పదేపదే చెబుతున్నారు. అయితే దీన్ని కొందరు ఎంఎల్ఏలు అంగీకరించటంలేదు. పనితీరు ఆధారంగా కొందరు మంత్రులు, ఎంఎల్ఏలకు జగన్ టికెట్లు నిరాకరించబోతున్నట్లు అందరు ఊహించిందే.

ఎందుకంటే పార్టీ కార్యక్రమం గడపగడపకు వైసీపీ మొదలైన దగ్గర నుండి పనితీరు బాగాలేని వాళ్ళకి టికెట్లు ఇవ్వనని జగన్ చాలాసార్లు హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే ఏకంగా ఇంతమందికి టికెట్లు నిరాకరిస్తారని ఎవరూ ఊహించినట్లు లేరు. టికెట్లు నిరాకరించటమే కాకుండా చాలామందికి నియోజకవర్గాలను కూడా మార్చేస్తారని అనుకోలేదు. మొత్తంమీద పార్టీలో జగన్ పెద్ద ప్రక్షాళన చేస్తుండటంతో పార్టీ నేతలు ఆశ్చర్యపోతున్నారు. దీని వల్ల రాబోయే ఎన్నికల్లో లాభమా ? నష్టమా ? అంటే ఎవరు సమాధానం చెప్పలేకపోతున్నారు. జగన్ అయితే అసంతృప్తులను అసలు పట్టించుకోవటమే లేదు.

ఎందుకంటే టికెట్ల కేటాయింపులో ఇంతటి భారీ ప్రక్షాళన గతంలో ఏ పార్టీలో కూడా జరగలేదు. కాబట్టి ఈ విషయం రాజకీయ పార్టీల్లోనే కాదు మామూలు జనాలకు కూడా కొత్తగానే ఉంది. అందుకనే వైసీపీకి సంబంధించి రాబోయే ఫలితాలు ఎలాగుంటాయనే విషయంలో పార్టీ నేతల్లోనే చర్చలు పెరిగిపోతున్నాయి. పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే జగన్ తప్ప మిగిలిన అందరు పూర్తి గందరగోళంలోనే ఉన్నారని అర్ధమవుతోంది. నేతలకు, క్యాడర్ కు ఎప్పుడు క్లారిటి వస్తుందో చూడాలి.

Tags:    

Similar News