వైసీపీ కొత్త ఫార్ములా : సీనియర్లు...యువత ఎక్కడ ?

పార్టీలో యువతకు పెద్ద పీట వేయడం అదే సమయంలో సీనియర్ల అనుభవాలను వాడుకోవడం మీద దృష్టి పెట్టింది

Update: 2024-08-23 05:30 GMT

ఏపీలో తిరిగి నిలదొక్కుకోవడానికి వైసీపీ కొత్త ఫార్ములాను కనుగొంది. పార్టీలో యువతకు పెద్ద పీట వేయడం అదే సమయంలో సీనియర్ల అనుభవాలను వాడుకోవడం మీద దృష్టి పెట్టింది. ఈ ఫార్ములాను జగన్ తన సొంత జిల్లా కడప నుంచే అమలు చేసుకుంటూ వస్తున్నారు.

కడప జిల్లా పార్టీ పగ్గాలు మేనమామ రవీంద్రనాధ్ రెడ్డికి అప్పగించారు. ఆయన కుమారుడు నరేన్ కి కమలాపురం అసెంబ్లీ ఇంచార్జి పగ్గాలు ఇచ్చారు. ఇది ఫ్యూచర్ లో ఏపీలోని మిగిలిన జిల్లాలకు వర్తింపచేయాలని చూస్తున్నారు. ఉత్తరాంధ్రాలో చూసుకుంటే అనకాపల్లి జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గా మాజీ మంత్రి బూడి ముత్యాలనాయుడుకు పగ్గాలు అప్పగిస్తారు అని అంటున్నారు.

ఆయన రాజకీయ వారసురాలుగా ఉన్న కుమార్తె ఈర్లె అనూరాధ మాడుగుల అసెంబ్లీకి 2024 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. దాంతో ఆమెకే ఇంచార్జి పగ్గాలు ఇస్తారు అని అంటున్నారు. బొత్సకు ఉత్తరాంధ్రా బాధ్యతలు అప్పగించి ఆయన కుమారుడికి చీపురుపల్లి అసెంబ్లీ బాధ్యతలు ఇస్తారని అంటున్నారు. శ్రీకాకుళం జిల్లా వైసీపీ ప్రెసిడెంట్ గా మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుని నియమించి ఆయన కుమారుడు ధర్మాన రామమనోహర్ నాయుడుని శ్రీకాకుళం అసెంబ్లీ ఇంచార్జిని చేస్తారు అని అంటున్నారు.

అలాగే మరో కీలక నేత ధర్మాన క్రిష్ణదాస్ ని రాష్ట్ర కమిటీలో తీసుకుని ఆయన కుమారుడికి నరసన్నపేట పార్టీ బాధ్యతలు ఇస్తారని టాక్ నడుస్తోంది. ఆముదాలవలసలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ని పార్టీలో కీలక పదవిలోకి తీసుకుని అక్కడ కొత్త వారికి చాన్స్ ఇవ్వాలని అనుకుంటున్నారని టాక్.

అలాగే సాలూరు నియోజకవర్గంలో కూడా మాజీ మంత్రి పీడిక రాజన్నదొరని తప్పించి కొత్త ముఖాన్ని తెస్తారని అంటున్నారు. అలాగే రాజన్నదొరకు మన్యం జిల్లా పగ్గాలు అప్పగించడమా లేక రాష్ట్ర కమిటీలో తీసుకోవడమా అన్నది చర్చగా సాగుతోందిట.

ఇలా చూస్తే కనుక ఏపీ అంతటా ఇదే విధానం అమలు చేయాలని చూస్తున్నారు అని అంటున్నారు. పార్టీ కోసం పనిచేసేవారికి పెద్దరికం ఇస్తూ పనిచేయని వారిని వదిలించుకోవాలని కూడా వైసీపీ ఆలోచిస్తోంది అని అంటున్నారు. వైసీపీ పార్టీని పునర్నిర్మించే పనిలో ఉంది. దాంతో యువతకే బాధ్యతలు ఇస్తే వారు పార్టీని ముందుకు కదిలిస్తారు అని చూస్తోంది.

ఈ క్రమంలో సీనియర్లకు రానున్న ఎన్నికల్లో టికెట్లు దక్కుతాయా అంటే గెలుపు ప్రాతిపదికతో పాటు యువతకే ప్రాముఖ్యత అని వైసీపీ కొలమానం పెట్టుకుంది అని అంటున్నారు. మరి వైసీపీ హై కమాండ్ తొందరలో ఈ విధంగా నియామకాలు చకచకా చేపడుతుంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News