జగన్ ముద్దు...ఆయన వద్దు...వైసీపీలో కొత్త పంచాయతీ...!

జగన్ అంటే ఇష్టమే కానీ లోకల్ ఎమ్మెల్యేతో పడదు, ఆయన వద్దే వద్దు అంటున్నారు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్లకు చెందిన వైసీపీ అసమ్మతి నేతలు

Update: 2024-04-07 03:47 GMT

జగన్ అంటే ఇష్టమే కానీ లోకల్ ఎమ్మెల్యేతో పడదు, ఆయన వద్దే వద్దు అంటున్నారు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్లకు చెందిన వైసీపీ అసమ్మతి నేతలు. ఎచ్చెర్ల వైసీపీ టికెట్ ని సిట్టింగ్ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ కే వైసీపీ కేటాయించింది. ఆయనకు టికెట్ వద్దు అని గత రెండేళ్ళుగా పార్టీ నేతలు ఆందోళన చేస్తూ వస్తున్నారు.

అయితే ఇపుడు ఆయనకే టికెట్ రావడంతో వారంతా మండిపోతున్నారు. తాము మరోసారి వైసీపీ హై కమాండ్ కి వినతి చేస్తున్నామని ఆ పార్టీ సీనియర్ నేతలు అంటున్నారు. గొర్లె కిరణ్ కుమార్ పార్టీకి ఏమీ చేయలేదని పార్టీ కోసం పనిచేసిన నాయకులను ఆయన అసలు పట్టించుకోలేదని విమర్శిస్తున్నారు.

వైసీపీ ఎమ్మెల్యే గెలుపు కోసం తాము ఎంతో శ్రమకోర్చామని డబ్బులు కూడా ఖర్చు పెట్టామని తీరా అయిదేళ్ళ పాటు తమకు నరకం చూపించారని వారు అంటున్నారు. అందుకే ఆయన వద్దు అని అంటున్నామని చెబుతున్నారు. ఈ విషయంలో అధినాయకత్వం సరైన డెసిషన్ తీసుకోవాలని మరో సమర్ధ నేతకు టికెట్ ఇస్తే ఎచ్చెర్ల సీటులో వైసీపీని గెలిపీంచుకుని వస్తామని వారు హామీ ఇస్తున్నారు.

అలా కాదు అనుకుంటే అసమ్మతి నేతల నుంచి ఒకరిని ఎంపిక చేసి ఇండిపెండెంట్ గా నిలబెడతామని వారు స్పష్టం చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాము మంత్రి బొత్స సత్యనారాయణకు విధేయులమని ఆయన చెప్పినట్లుగా నడచుకుంటామని అంటున్నారు. దీంతో అనేక అనుమానాలు వస్తున్నాయి. బొత్స ఎచ్చెర్ల సీటు విషయంలో చక్రం తిప్పుతున్నారా అన్న చర్చ వస్తోంది.

బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకుంటున్నారు. కానీ ఆయనకు ఎక్కడా సీటు జగన్ ప్రకటించలేదు. ఆయన ఎచ్చెర్ల నుంచి పోటీకి ఆసక్తిని వ్యక్తం చేశారు. చాలా కాలంగా ఆయన స్థానిక పార్టీ నేతలతో మంచి రిలేషన్స్ ని కూడా మెయింటెయిన్ చేస్తూ వస్తున్నారు.

దాంతో ఆయనకు టికెట్ ఖాయమని అంతా అనుకున్నారు. కానీ ఇపుడు చూస్తే గొర్లెకే మరోసారి టికెట్ ఖాయం అయింది. దాంతో సడెన్ గా అసమ్మతి నేతలు మీడియా ముందుకు వచ్చారని అంటున్నారు. ఇండిపెండెంట్ ని నిలబెడతామని వారు హెచ్చరిస్తున్నారు. అయితే వైసీపీ అధినాయకత్వం కూడా అన్ని విషయాలను పరిశీలిస్తోంది. నామినేషన్లకు ఇంకా మరో పది రోజులకు పైగా సమయం ఉంది.

ఈలోగా జనాల్లో కూడా అభ్యర్ధుల మీద ఏ రకమైన అభిప్రాయం ఉందో వారు గెలుపు గుర్రాలేనా కాదా అన్నది కూడా చూసుకుని మరీ వీలుంటే కొన్ని సీట్లలో క్యాండిడేట్లను మార్చవచ్చు అని అంటున్నారు. జగన్ బస్సు యాత్ర ఉత్తరాంధ్రా చేరేలోగా ఈ మార్పు చేర్పులు ఉండవచ్చు అంటున్నారు. దాంతోనే అసమ్మతి నేతలు గళం విప్పారని అంటున్నారు.

Tags:    

Similar News