టార్గెట్ పవన్.. వైసీపీకి లాభం తక్కువ, డ్యామేజ్ ఎక్కువ
రాజకీయాలు రాజకీయాలుగానే చేయాలి. అంతేకాదు.. కోడి గుడ్డుపై ఈకలు పీకే చందంగా ఎవరూ వ్యవహరించకూడదు.
రాజకీయాలు రాజకీయాలుగానే చేయాలి. అంతేకాదు.. కోడి గుడ్డుపై ఈకలు పీకే చందంగా ఎవరూ వ్యవహరించకూడదు. నిర్మా ణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు వైసీపీ నాయకులు ఎలానూ సిద్ధంగా లేరనేది తెలిసిపోయింది. కనీసం నిర్మాణాత్మక రాజ కీయాలైనా చేస్తే.. `పోయిన` పరువు దక్కుతుంది. కానీ, వైసీపీలో కొందరు నాయకులు మాత్రం అలా చేయడం లేదు. పిల్ల చేష్ఠలు.. పిల్ల రాజకీయాలు చేస్తూ.. వారికి వారే.. మరిన్ని `మైనస్`లు వేసుకుంటున్నారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విషయంలో వైసీపీ నాయకులు చేస్తున్న ప్రచారం బూమరాంగ్ అవుతోంది.
పవన్ కల్యాణ్‌ను ఇప్పుడు రాజకీయంగా విమర్శించేందుకు వైసీపీ దగ్గర సరుకు లేదు. ఎన్నికలకు ముందు పిల్ల కాకి.. ఏం చేస్తాడు? అసెంబ్లీ గడప కూడా తాకలేడు.. వంటి వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. కానీ, ఎన్నికల్లో పవన్ దుమ్మురేపి.. 21 స్థానాలకు 21 చోట్లా విజయం దక్కించుకున్న పరిస్థితి కనిపించింది. అంతేకాదు.. ఇద్దరు ఎంపీలను కూడా గెలిపించుకున్నారు. దీనికితోడు.. డిప్యూటీ సీఎంగా ఎవరూ ఊహించని విధంగా ఆయన దూసుకుపోతున్నారు. దీంతో రాజకీయంగా ఆయనను ఏమీ అనలేని కొందరు వైసీపీ నాయకులు.. చిన్న చిన్న లోపాలను కూడా బూతద్దంలో వెతుకుతున్నారు.
వీటిని సోషల్ మీడియాలో వైరల్ చేసి.. ట్రోల్ చేస్తున్నారు. దీనివల్ల వారికి వచ్చే ఆనందం ఏంటో.. వారికే తెలియాలి. తాజాగా పవన్ కల్యాణ్.. చెత్త నుంచి సంపద సృష్టి ఎలా చేయాలనే విషయంపైఅ ధికారులతో చర్చలు జరిపారు. అనంతరం.. ఆయన మీడియా మీటింగ్ పెట్టారు. ఈ సమయంలో ఆయన చేతిలో ఉన్న మైకును ఎదురుగా ఉన్న టేబుల్‌పై పెట్టబోయారు. కానీ, అది జారిపోయింది. ఆ వెంటనే ఆయన పక్కనే ఉన్న పోడియం వద్దకు వెళ్లి నిలబడి గణాంకాలతో సహా.. మీడియాకు కొన్ని వివరాలు వెల్లడించారు. అయితే.. పవన్ చేతిలో మైకు జారిపోయిన విషయాన్ని చిలవలు పలవలు చేసిన.. వైసీపీ గ్యాంగ్.. పవన్ అసహనం వ్యక్తం చేస్తున్నాడని.. ఆయనకు మేనేజ్ చేయడం చేతకావడం లేదని, అధికారులతో ఎలా వ్యవహరించాలో తెలియడం లేదని.. అందుకే మైకు విసిరి కొట్టాడని వ్యాఖ్యానిస్తూ.. వైరల్ చేసింది.
దీనికి జనసేన నాయకులు ఒరిజినల్ వీడియోతో ఘాటుగా సమాదానం చెప్పారు.ఇక, కొన్నాళ్ల కిందట పిఠాపురంలో పవన్ పర్యటించినప్పుడు.. రోడ్డు పక్కగా ఓ చిన్నారి.. చేతిలో పూల దండ పట్టుకుని పవన్ కోసం ఎదురు చూశాడు. ఈ విషయం చూసిన పవన్.. తన కాన్వాయ్‌ను ఆపి.. మరీ చిన్నారి వద్దకు వెళ్లి.. పూల దండ తీసుకున్నారు. ఈ సమయంలో ఆయన చిన్నారి బుగ్గ నిమిరారు. అయితే.. దీనిని వైసీపీ నాయకులు యాంటీగా చూపిస్తూ.. చిన్నారి బుగ్గపై చేయి చేసుకున్నాడంటూ.. పవన్‌పై యాంటీ వైరల్ చేశారు.
ఆ తర్వాత.. అటవీ శాఖపై సమీక్ష చేసినప్పుడు కూడా.. పవన్.. ఏదో ఆలోచిస్తూ.. కళ్లు మూసుకుంటే.. ఆయన నిద్ర పోతున్నారని.. పెద్ద ఎత్తున వైరల్ చేశారు. అయితే.. వీటిని అసలు వీడియోలతో జనసేన తిప్పికొడుతోంది. కానీ, ఇలాంటి వ్యవహారాల వల్ల వైసీపీనే పలుచన అవుతోందని అంటున్నారు పరిశీలకులు. చిన్న చిన్న విషయాలను పెద్దవి చేసి.. ప్రచారం చేయడం వల్ల.. పవన్ కు జరిగే నష్టం ఏమీలేదని.. వైసీపీనే ఇంకా డైల్యూట్ అవుతుందని అంటున్నారు.