వైసీపీలోకి వైఎస్‌ రాజకీయ ప్రత్యర్థి!

ఎందుకంటే వైఎస్‌ ఫ్యామిలీ కంచుకోట అయిన పులివెందులలో వైఎస్‌ రాజకీయ ప్రత్యర్థి అయిన నేత ఇప్పుడు వైసీపీలో చేరాలని నిర్ణయించుకోవడమే.

Update: 2024-02-29 03:59 GMT

ఆంధ్రప్రదేశ్‌ లో ఎన్నికల ముంగిట జంపింగ్‌ జ పాంగులు చోటు చేసుకుంటున్నాయి. ఒక పార్టీ నుంచి మరొక పార్టీలోకి చేరికలు ఎక్కువవుతున్నాయి. అయితే తాజా చేరిక మాత్రం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. ఎందుకంటే వైఎస్‌ ఫ్యామిలీ కంచుకోట అయిన పులివెందులలో వైఎస్‌ రాజకీయ ప్రత్యర్థి అయిన నేత ఇప్పుడు వైసీపీలో చేరాలని నిర్ణయించుకోవడమే. ఇప్పుడీ ఈ నేత చేరిక ఆసక్తి రేపుతోంది.

ఎస్వీ సతీశ్‌ కుమార్‌ రెడ్డి.. టీడీపీ నేత. 2004, 2009 ఎన్నికల్లో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిపైన పులివెందుల నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. వైఎస్సార్‌ పైనే కాకుండా 2014, 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌ కుమారుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పైన కూడా పోటీ చేశారు. అయితే నాలుగుసార్లు ఎస్వీ సతీష్‌ కుమార్‌ రెడ్డి ఓడిపోయారు. అయినప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబు ఆయనను ఎమ్మెల్సీని చేశారు. అంతేకాకుండా శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ ను కూడా చేశారు.

కాగా ఇటీవల చంద్రబాబు వచ్చే ఎన్నికల కోసం ప్రకటించిన జాబితాలో పులివెందుల నుంచి బీటెక్‌ రవికి సీటు లభించింది. సతీశ్‌ కుమార్‌ రెడ్డికి సీటు ఇవ్వలేదు. దీంతో పులివెందుల వైసీపీ నేతలు స్వయంగా సతీశ్‌ కుమార్‌ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనను తమ పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో ఆయన వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.

ఈ సందర్భంగా సతీశ్‌ కుమార్‌ రెడ్డి హాట్‌ కామెంట్స్‌ చేశారు. గత మూడు దశాబ్దాలుగా టీడీపీ నేతగా ఆ పార్టీకి ఎనలేని సేవలు చేసినా ఫలితం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను నమ్మిన టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌.. వైఎస్‌ కుటుంబంతో లాలుచీ పడ్డానని తనను అవమానించారని ఆరోపించారు. దీంతో టీడీపీకి రాజీనామా చేసి, గత నాలుగేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్నానని తెలిపారు.

తెలుగుదేశం పార్టీకి పులివెందుల నియోజకవర్గంలో పెద్ద దిక్కుగా నిలిచి, అనేక రాజకీయ పోరాటాలు చేశానని సతీశ్‌ కుమార్‌ రెడ్డి గుర్తు చేశారు. ఈ క్రమంలో అనేక విధాలుగా సమస్యలు ఎదుర్కొన్నానని చెప్పారు. కొంతమంది టీడీపీ నేతల చెప్పుడు మాటలు విని టీడీపీ అధికారంలో ఉన్నన్నాళ్లు తనను ఛీత్కారంతో చూశారని వాపోయారు. పార్టీలో నేతల కుట్రలు, కుతంత్రాలకు విసిగిపోయి కొన్నేళ్లు టీడీపీకి దూరంగా ఉండాల్సి వచ్చిందన్నారు.

అయితే తన అనుచరులు, కార్యకర్తలు తిరిగి రాజకీయ ప్రవేశం చేయాలని తనను ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు. తాను ఇన్నాళ్లూ ఎవరితో పోరాటం చేశానో అలాంటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తనకు స్నేహ హస్తం అందించారని తెలిపారు. ఇది తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు.

సీఎం వైఎస్‌ జగన్‌ ఆహ్వానం మేరకు తాను వైసీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నానని సతీశ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో పులివెందుల నియోజకవర్గం అన్ని విధాలా అభివృద్ధి చెందుతోందన్నారు. గత 30 ఏళ్ల నుంచి టీడీపీకి ఏ విధంగా సేవ చేశానో అదే స్ఫూర్తితో ఇక నుంచి వైసీపీ కోసం పనిచేస్తానని తెలిపారు.

Tags:    

Similar News