వైఎస్సార్ కి అసలైన వారసులు ?

వైఎస్సార్ తెలుగు నాట అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రి.. ముఖ్యమంత్రిగా పదవిలో ఉంటూ మరణించిన ఏకైక నాయకుడు

Update: 2024-07-08 08:39 GMT

వైఎస్సార్ తెలుగు నాట అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రి.. ముఖ్యమంత్రిగా పదవిలో ఉంటూ మరణించిన ఏకైక నాయకుడు. ఆయన రెండు సార్లు సీఎంగా పనిచేశారు. మొత్తం కలిపి అయిదుంపావు ఏళ్ళు మాత్రమే.

అయితేనేమి తన జనరంజకమైన పాలనతో తెలుగు వారి గుండెలలో చిర స్థాయిగా చోటు సంపాదించుకున్నారు. వైఎస్సార్ జీవించి ఉన్న కాలంలో ఆయన వారసులు ఎవరూ అన్న చర్చ ముందుకు రాలేదు. ఆయన కూడా ఆరు పదుల వయసులో ఇంకా ముఖ్యమంత్రి పదవీకాలం నిండుగా ఉండగానే మరణించారు.

అయితే వైఎస్సార్ మరణించేనాటికి ఆయన కుమారుడు జగన్ ఎంపీగా ఉన్నారు. ఆయనను వైఎస్సార్ రాజకీయ వారసుడిగా ఆయన అభిమానులు కాంగ్రెస్ నేతలు అనుచరులు అంతా భావించారు. దాని ఫలితంగా వైసీపీ ఏర్పాటు అయింది. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా వరస విజయాలను సాధిస్తూ 151 సీట్లతో 2019లో అధికారంలోకి సైతం వచ్చింది.

అప్పటిదాకా వైఎస్సార్ వారసుడిగా జగన్ నే చూసుకుంటూ జనాలు కూడా వచ్చారు. అయితే అయిదేళ్ల జగన్ పాలన తరువాతనే పోలిక మొదలైంది. వైఎస్సార్ ని అభిమానించే నాయకులు కూడా జగన్ ఆయనలా కాదు అనుకుని దూరమయ్యారు. అలాగే వైఎస్సార్ వెంట బలంగా నిలిచి జగన్ కి సైతం మద్దతుగా నిలబడిన బలమైన సొంత సామాజిక వర్గం దూరం అయింది.

ఇక క్యాడర్ కూడా వైసీపీ అధినాయకత్వం పోకడల పట్ల కినుక వహించి దూరం అయింది. ఇలా అనేక కారణాల వల్ల వైసీపీ 2024లో జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలు అయింది. వైఎస్సార్ వారసత్వం జగన్ అందిపుచ్చుకుని పాలన సాగించారు అని సంక్షేమ పధకాలు రెట్టింపు ఇచ్చారని ఆ పార్టీ నేతలు అంటున్నా వైఎస్సార్ అభివృద్ధి కార్యక్రమాలను జగన్ ఆయనలా చేయలేదన్న విమర్శలు ఉన్నాయి.

అలాగే రాజకీయంగా పట్టు విడుపులతో వైఎస్సార్ ముందుకు సాగారు. ఎవరినీ ఆయన వ్యక్తిగత శత్రువుగా చూడలేదు. అందరివాడుగా ఆయన నిలిచారు. తన ప్రత్యర్థులను సైతం చిరునవ్వుతో పలకరించే అరుదైన గుణం ఆయన సొంతం. అదే జగన్ లో కరవు అయింది అన్న వారూ ఉన్నారు. వైఎస్సార్ నుంచి పట్టుదలను పుణికి పుచ్చుకున్న జగన్ విడుపు వైఖరిని మాత్రం వంట బట్టించుకోలేకనే బ్రహ్మాండమైన మెజారిటీని ప్రజలు కట్టబెడితే కేవలం అయిదేళ్ళకే అధికారం నుంచి దూరం అయ్యే పరిస్థితులు తెచ్చుకున్నారు అని అంటారు.

అదే వైఎస్సార్ వరసగా రెండు సార్లు గెలిచి జన హృదయ నేతగా నిలిచారు అని కూడా గుర్తు చేస్తారు. వైఎస్సార్ వారసత్వం అంటే ఆయన లక్షణాలను ఆయన పాలనా ధోరణలను ఆయన ఆలోచనలను కూడా అమలు చేయడం తనలో జీర్ణింపచేసుకోవడం అని అంటారు. జగన్ అయితే ఆ దిశగా అడుగులు వేస్తేనే వారసుడిగా నిలుస్తారు అని అంటారు.

ఇక ఆయన కుమార్తె వైఎస్ షర్మిల వైఎస్సార్ వారసత్వం కోసం చూస్తున్నారు. పోరాడుతున్నారు. రాజన్న బిడ్డగా తనకు కూడా హక్కులు ఉన్నాయని ఆమె అంటున్నారు. అయితే ఆమె కడప ఎంపీగా పోటీ చేసి కేవలం లక్షన్నర ఓట్లు మాత్రమే సాధించారు. ఆమె కాంగ్రెస్ పగ్గాలు స్వీకరించినా ఏపీలో ఆ పార్టీ ఎక్కడా పెద్దగా ఎదిగిన దాఖలాలు లేవు

ఆమె రాజన్న బిడ్డను అన్న ట్యాగ్ తప్ప సొంతంగా నాయకత్వ లక్షణాలను ఈ రోజుకీ చూపించలేకపోతున్నారు అని అంటున్నారు. ఆమె కాంగ్రెస్ పార్టీకి ఏపీ బాధ్యతలు చూస్తున్నారు. కాంగ్రెస్ అంటే మహా సముద్రం. వైఎస్సార్ సీఎం కావాలంటేనే 21 ఏళ్ళు ఎదురు చూడాల్సి వచ్చింది. ఈ రోజుకు రాజన్న బిడ్డగా చూసి కాంగ్రెస్ ఆమెకు పీసీసీ చీఫ్ పదవిని ఇచ్చినా ఆమె రానున్న రోజులలో తన సత్తాను చాటాల్సి ఉంటుంది.

ఆమె రాజకీయంగా ఇంకా తొలి అడుగుల దగ్గరే ఉన్నారు. వైఎస్సార్ వారసత్వం అన్న పెద్ద సంపదకు హక్కుదారు కావడం అంటే చాలా దూరం ప్రయాణించాలి. ఈ ప్రయాణంలో అందరినీ కలుపుకుని పోవాలి. కాంగ్రెస్ లో ఆమె నాయకత్వం పట్ల ఈ రోజుకీ మెచ్చని వారు ఒప్పని వారు చాలా మందే ఉన్నారు అన్నది తెలుస్తూనే ఉంది. ఆమె ఒంటెద్దు పోకడలు విడనాడి అందరినీ కలుపుకుని పోవాలి. అదే సమయంలో తాను సొంతంగా ఇమేజ్ ని క్రియేట్ చేసుకోవాలి. అపుడు మాత్రమే ప్రజలు ఆమె పట్ల చూస్తారు.

ఏది ఏమైనా ఈ రోజు వరకూ చూస్తే వైఎస్సార్ రాజకీయ వారసత్వం పోటీలో జగనే చాలా ముందున ఉన్నారు. అయితే ఆయన పూర్తిగా వైఎస్సార్ పోకడలను అమలు చేయలేదన్న అసంతృప్తి జనంలోనూ పార్టీ జనంలోనూ ఉంది. అలా ఆయన మారాలి. ఇక షర్మిల జగన్ కంటే తాను మిన్నను అని చెప్పుకోవడానికి ఎన్నో మెట్లు ఎక్కాల్సింది ఉంది. వైఎస్సార్ నిండు వ్యక్తిత్వాన్ని అలవరచుకున్న ప్రతీ వారూ ఆయనకు అసలైన వారసులే అని కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News