మొదలుపెట్టిన షర్మిల.. పట్టించుకోని టీడీపీ వర్గాలు!

కేంద్రంలో బీజేపీకి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన పూర్తి స్థాయి మెజారిటీ రాని సంగతి తెలిసిందే.

Update: 2024-07-01 08:28 GMT

కేంద్రంలో బీజేపీకి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన పూర్తి స్థాయి మెజారిటీ రాని సంగతి తెలిసిందే. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ, బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ నేతృత్వంలోని జేడీయూలపైన ఆధారపడి కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పాటయింది.

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా తీసుకురావాలనే డిమాండ్లు ఎక్కువ అవుతున్నాయి. రాష్ట్రం విడిపోయాక జరిగిన 2014, 2019 ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీకి సొంతంగా మెజారిటీ వచ్చింది. దీంతో మిత్ర పక్షాల పైన ఆధారపడాల్సిన పరిస్థితి ఆ పార్టీకి రాలేదు. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు కూడా తమ రాష్ట్రాలకు కావాల్సిన డిమాండ్లను సాధించుకోలేకపోయాయి.

అయితే ఈసారి పరిస్థితి మారింది. టీడీపీ, జనసేన మద్దతుపైన కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. ఈ రెండు పార్టీలకు 18 మంది ఎంపీల బలం ఉంది. ఈ నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావాలని వైసీపీ, సీపీఎం, సీపీఐ గట్టిగా డిమాండ్‌ వినిపిస్తున్నాయి.

ఇప్పుడు ఈ కోవలో కాంగ్రెస్‌ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కూడా చేరారు. చంద్రబాబు ఏపీకి ప్రత్యేక హోదా సాధించాలని కోరారు. బీహార్‌ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని నితీష్‌ కుమార్‌ తీర్మానం చేసి మోదీకి పంపారని షర్మిల గుర్తు చేశారు. అదే మాదిరిగా మోదీ సర్కారులో కింగ్‌ మేకర్‌ గా ఉన్న చంద్రబాబు కూడా చేయాలన్నారు. ఇప్పటివరకు ప్రత్యేక హోదాపై చంద్రబాబు నోరు ఎందుకు విప్పడం లేదని షర్మిల నిలదీశారు. ఈ మేరకు ఆమెకు సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. వైఎస్‌ షర్మిల పోస్టు ఇలా ఉంది...

‘‘బీహార్‌ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని నితీష్‌ తీర్మానం చేసి మోదీ ముందట డిమాండ్‌ పెడితే.. ఏపీకి హోదాపై చంద్రబాబు గారు కనీసం నోరు విప్పడం లేదు. మోడీ సర్కార్‌ లో కింగ్‌ మేకర్‌ గా ఉన్న మీరు.. హోదాపై ఎందుకు మౌనం వహిస్తున్నారో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. రాజధాని లేని రాష్ట్రంగా బీహార్‌ కంటే వెనకబడి ఉన్నామని మీకు తెలియదా? 15 ఏళ్లు హోదా కావాలని అడిగిన రోజులు మీకు గుర్తులేదా?’’ అని షర్మిల నిలదీశారు.

‘‘ రాష్ట్ర అభివృద్ధిలో ఏపీ 20 ఏళ్లు వెనకబడిందని చెప్పింది మీరే కదా? హోదా ఇవ్వకుంటే మద్దతు ఉపసంహరణ అని ఎందుకు అడగడం లేదు? మోసం చేసిన మోడీతో హోదాపై సంతకం ఎందుకు పెట్టించలేరు ? ప్రత్యేక హోదాపై మీ వైఖరి ఏంటో చెప్పాలని, రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రం దగ్గర హోదా డిమాండ్‌ పెట్టాలని, చంద్రబాబు గారిని ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తోంది. ప్రత్యేక ప్యాకేజీలు కాదు...రాష్ట్ర అభివృద్ధికి హోదా ఒక్కటే మార్గమని అని గుర్తు చేస్తున్నాం’’ అంటూ షర్మిల పోస్టు చేశారు.

అయితే.. వైఎస్‌ షర్మిల వ్యాఖ్యలను టీడీపీ వర్గాలేవీ పట్టించుకోవడం లేదు. కేంద్రంలో తమకు పదవులు, ఇతర హోదాలు ఏమీ అవసరం లేదని, రాష్ట్రానికి కావాల్సిన ప్రయోజనాలే అడుగుతామని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో షర్మిల మాటలను టీడీపీ వర్గాలు లైట్‌ తీసుకుంటున్నాయి.

Tags:    

Similar News