తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ క‌న్నుమూత‌

ప్రఖ్యాత తబలా విద్వాంసుడు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ ఈ ఆదివారం (15 డిసెంబరు 2024) క‌న్ను మూసారు.

Update: 2024-12-16 00:30 GMT

ప్రఖ్యాత తబలా విద్వాంసుడు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ ఈ ఆదివారం ( 15 డిసెంబరు 2024) క‌న్ను మూసారు. ఆయ‌న వ‌య‌సు 73. దిగ్గజ సంగీతకారుడు గత రెండు వారాలుగా శాన్ ఫ్రాన్సిస్కో ఆసుపత్రిలోని ఐసియులో గుండె సంబంధిత సమస్యకు చికిత్స పొందుతున్నారు. అతని మరణ వార్త సంగీత ప్రపంచాన్ని, అభిమానుల‌ను తీవ్ర శోకసంద్రంలో ముంచెత్తింది. ప్రపంచవ్యాప్తంగా సంతాపం వెల్లువెత్తుతోంది. సినీరాజ‌కీయ రంగాలు, సంగీత ప్ర‌పంచం నుంచి అత‌డికి నివాళులు అర్పించేందుకు ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియాల్ని ఆశ్ర‌యించారు.

ఈ మ‌ర‌ణ‌వార్త విన్న వెంట‌నే రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తన విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. హుస్సేన్ మేనేజర్ నిర్మలా బచానీ సంబంధిత విష‌యాన్ని ధృవీక‌రిస్తూ.. గత రెండు వారాలుగా గుండె సంబంధిత సమస్యతో శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆసుపత్రిలో చేరార‌ని తెలిపారు. బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ కూడా ఇన్‌స్టాలో జాకీర్ ఫోటోని షేర్ చేస్తూ నివాళులర్పించారు. ఈ క్లిష్ఠ స‌మ‌యంలో అతడు మన జీవితాలకు తెచ్చిన ఆనందంలో మనం ఓదార్పుని పొందుతామని అనూప్ జ‌లోటా వ్యాఖ్యానించారు.

ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ అసాధారణమైన తబలా నైపుణ్యం సంగీత ప్రపంచంలో శాశ్వతమైన ముద్ర వేసింది. కళాత్మకతతో జీవితాలను స్పృశించిన ఆయన కుటుంబసభ్యులకు, స్నేహితులకు, అసంఖ్యాక అభిమానులకు ప్రగాఢ సానుభూతి. అతని లయలు మన హృదయాలలో ఎప్పటికీ ప్రతిధ్వనిస్తాయి.. అని ప‌లువురు సినీ ప్ర‌ముఖులు నివాళుల‌ర్పించారు. జాకీర్ కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేసారు.

జాకీర్ సాబ్ అసమాన తబలా నైపుణ్యం, భారతీయ శాస్త్రీయ ప్రపంచ సంగీతానికి మార్గదర్శకుడిగా నిలిచారు. ఉస్తాద్ అల్లా రఖాకు 1951లో జన్మించిన జాకీర్ బాల‌కుడిగా కేవలం ఏడేళ్ల వయసులో ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించాడు. అతడి కెరీర్‌లో తబలా స్థాయిని కొత్త ఎత్తులకు చేర్చాడు. సాంకేతిక నైపుణ్యం, భావోద్వేగ కళాత్మకతకు ఎన్నో అవార్డులు రివార్డులు ప్రశంసలు పొందాడు. సోలో ఆర్టిస్ట్‌గా పండిట్ రవిశంకర్, ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్, జార్జ్ హారిసన్, జాన్ మెక్‌లాఫ్లిన్, మిక్కీ హార్ట్ ఆఫ్ ది గ్రేట్‌ఫుల్ డెడ్ వంటి లెజెండ్‌లతో కలిసి పని చేస్తూ తబలా వాద్యాన్ని రీడిఫైన్ చేసారు. 1970లో ఇండియన్ క్లాసికల్ మరియు జాజ్ ప్రభావాలను మిళితం చేస్తూ మెక్‌లాఫ్లిన్‌తో కలిసి శక్తి అనే ఫ్యూజన్ గ్రూప్‌ను స్థాపించాడు. రిమెంబర్ శక్తి , ప్లానెట్ డ్రమ్ వంటి ప్రాజెక్ట్‌లు అతని వినూత్న స్ఫూర్తికి గొప్ప ఉదాహ‌ర‌ణ‌లుగా నిలిచాయి. హీట్ అండ్ డస్ట్, ఇన్ కస్టడీ వంటి చిత్రాలకు, అలాగే అంతర్జాతీయ బ్యాలెట్, ఆర్కెస్ట్రా ప్రొడక్షన్‌లకు త‌బ‌లా పాండిత్యాన్ని జాకీర్ అందించారు.

భారతీయ సంగీతాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయడంలో అతడి అంకితభావాన్ని భార‌త‌ ప్ర‌భుత్వం గుర్తించింది. పద్మభూషణ్, పద్మశ్రీ పుర‌స్కారాల‌ను అందించి గౌర‌వించింది. ఉత్తమ సమకాలీన ప్రపంచ సంగీత ఆల్బమ్‌గా గ్రామీ అవార్డును కూడా ఆయ‌న దక్కించుకున్నారు. 73 వ‌య‌సులో గుండె సమస్యలతో పోరాడిన తర్వాత అమెరికాలోని ఆసుపత్రిలో తుది శ్వాస తీసుకున్నారు.

Tags:    

Similar News