లోకేశ్ కు జెడ్ కేటగిరీ భద్రత.. తాజా నిర్ణయం
మొత్తం22 మంది సిబ్బంది మూడు షిప్టుల్లో లోకేశ్ కు నిరంతరం భద్రత కల్పిస్తారు. వీరిలో 4-5 మధ్య ఎన్ ఎస్ జీ కమాండోలు ఉంటారని చెబుతున్నారు.
ఏపీలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. విపక్ష టీడీపీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న నారా లోకేశ్ కు భద్రతను పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. సీఆర్పీఎఫ్ బలగాలతో కూడిన జెడ్ కేటగిరీ భద్రతను కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాలే దీనికి కారణమని చెబుతున్నారు.
ఇటీవల కాలంలో లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో చోటు చేసుకున్న భద్రతా వైఫల్యాలు.. నిఘా వర్గాల సమాచారం మేరకు భద్రతను కల్పించాలని నిర్ణయించింది. మొత్తం22 మంది సిబ్బంది మూడు షిప్టుల్లో లోకేశ్ కు నిరంతరం భద్రత కల్పిస్తారు. వీరిలో 4-5 మధ్య ఎన్ ఎస్ జీ కమాండోలు ఉంటారని చెబుతున్నారు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన సమయంలో లోకేశ్ ఏపీ ఐటీ మంత్రిగా పని చేశారు. ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఆయనకు కల్పించిన భద్రతను తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సెక్యూరిటీ రివ్యూ కమిటీ లోకేశ్ కు జెడ్ కేటగిరీ భద్రతను కల్పించాలని చెప్పినప్పటికీ వై కేటగిరీ భద్రతను మాత్రమే కల్పించారు.
ఇదిలా ఉంటే కీలక ఎన్నికల వేళ.. ఆయన భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలన్న లేఖల్ని ఆయన భద్రతా సిబ్బంది పలుమార్లు కేంద్రానికి.. రాష్ట్రానికి.. గవర్నర్.. కేంద్ర హోంశాఖకు విన్నవించాయి. ఈ క్రమంలో ఆయన భద్రతను పెంచుతూ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు.