అమెరికా భద్రతకు ముప్పు ?.. జుకర్‌బర్గ్ చైనా గూఢచారిగా మారాడా?
సుంకాల విషయంలో, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం రాజుకున్న వేళ, ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్‌పై మాజీ ఉద్యోగి సారా విన్ విలియమ్స్ సంచలన ఆరోపణలు చేశారు.;

సుంకాల విషయంలో, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం రాజుకున్న వేళ, ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్‌పై మాజీ ఉద్యోగి సారా విన్ విలియమ్స్ సంచలన ఆరోపణలు చేశారు. జుకర్‌బర్గ్ చైనాతో చేతులు కలిపి అమెరికా జాతీయ భద్రతకు ముప్పు తెస్తున్నారని, మెటా యూజర్ల డేటాను చైనా ప్రభుత్వానికి చేరవేస్తున్నారని ఆమె ఆరోపించారు. మెటా సంస్థ అనైతిక వ్యాపార విలువలు, గోప్యతా విధానాలకు సంబంధించి అమెరికా కాంగ్రెస్ విచారణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో, సారా విన్ విలియమ్స్ వేగుగా మారి కాంగ్రెస్ కమిటీ ముందు వాంగ్మూలం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె జుకర్‌బర్గ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు.
"మెటా ఎగ్జిక్యూటివ్‌లు పదేపదే జాతీయ భద్రతను అణగదొక్కి, మన దేశ విలువలకు ద్రోహం చేయడం నేను చూశాను. ఈ సంస్థ చైనా ప్రభుత్వం కోసం కస్టమ్ సెన్సార్‌షిప్ టూల్స్‌ను అభివృద్ధి చేసింది. ఈ టూల్స్‌తో కంటెంట్‌పై విస్తృత నియంత్రణ లభిస్తుంది. జుకర్‌బర్గ్ తాను దేశభక్తుడినని చెబుతారు. కానీ, గత దశాబ్దకాలంలో ఆయన చైనాలో 18 బిలియన్ డాలర్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఇప్పుడు బీజింగ్‌లో తన వ్యాపార ఉనికిని మరింత పెంచుకునేందుకే కమ్యూనిస్ట్ పార్టీతో స్నేహబంధాన్ని బలపరుచుకుంటున్నారు. అమెరికన్లు సహా మెటా యూజర్ల డేటాను చైనా ప్రభుత్వం తెలుసుకునేలా మెటా ఎగ్జిక్యూటివ్‌లు నిర్ణయాలు తీసుకుంటున్నారు" అని సారా విలియమ్స్ ఆరోపించారు.
అంతేకాకుండా, మెటా ఏఐ మోడల్ లామా చైనీస్ ఏఐ స్టార్టప్ డీప్‌సీక్‌కు సహకరిస్తోందని ఆమె తెలిపారు. ఈ విషయాలు మాట్లాడుతున్నందుకు తనపై 50 వేల డాలర్ల జరిమానా విధించారని ఆమె పేర్కొన్నారు. అయితే, మెటా సంస్థ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. "సారా వ్యాఖ్యలు వాస్తవ దూరం. ఆధారాలు లేకుండా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఆమెకు విధించిన జరిమానా కాంగ్రెస్ ముందు వాంగ్మూలం ఇచ్చినందుకు కాదు, ఉద్యోగం వీడేందుకు ఉన్న ఒప్పందాలను ఉల్లంఘించినందుకు విధించాం. చైనాలో మెటా ఎలాంటి సేవలు అందించడం లేదు" అని సంస్థ అధికార ప్రతినిధి ర్యాన్ డేనియల్ తెలిపారు. ఈ ఆరోపణలపై అమెరికా ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.