సుప్రీంకోర్టుకు బీఆర్ఎస్.. ఆ ఎమ్మెల్యేల్లో టెన్షన్

బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొంది.. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ పోరాడుతూనే ఉంది.

Update: 2025-01-17 07:07 GMT

బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొంది.. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ పోరాడుతూనే ఉంది. మొన్నటివరకు హైకోర్టును ఆశ్రయించిన గులాబీ పార్టీ.. ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లింది. దీంతో ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇవ్వనుందా అన్న ఉత్కంఠ సాగుతోంది.

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టులో గురువారం బీఆర్ఎస్ పార్టీ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. గతంలో కేశం మేఘా చంద్ర కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును దానికి జతచేసింది. ఇలాంటి కేసుల్లో స్పీకర్ మూడు నెలల్లోగా అనర్హత పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొన్నదని, దానికి అనుగుణంగా తెలంగాణ స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదని బీఆర్ఎస్ పార్టీ పేర్కొంది. నాలుగు వారాల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకునేలా చొరవ చూపాలని సుప్రీంకోర్టును కోరింది.

దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు తొలుత బీఆర్ఎస్ బీ ఫామ్ మీద ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారు. దీంతో వీరిపై చర్యలు తీసుకోవాలని ముందుగా స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. కానీ.. స్పీకర్ నుంచి స్పందన లేకపోవడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెంటనే హైకోర్టును ఆశ్రయించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని, విచారణ జరపాలని కోరారు. వారిని డిస్ క్వాలిఫై చేయాలంటూ విజ్ఞప్తి చేశారు. దాంతో విచారణ చేపట్టిన హైకోర్టు స్పీకర్‌కు, అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీచేసింది.

వెంటనే ఫిరాయింపుదారులపై విచారణ చేపట్టి నిర్ణీత సమయంలోగా వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలిచ్చింది. కానీ.. ఆరు నెలలు గడిచినా స్పీకర్ నుంచి ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు. దీంతో ఇదే క్రమంలో మరో ఏడుగురు ఎమ్మెల్యేలు సైతం పార్టీ మారారు. ఈ మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్పీకర్‌కు మరోసారి బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది.

అయినప్పటికీ స్పీకర్ స్పందించకపోవడంతో తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసి 9 నెలలు అవుతున్నా చర్యలు తీసుకోవడం లేదని పిటిషన్‌లో బీఆర్ఎస్ పార్టీ పేర్కొంది. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. మిగిలిన ఏడుగురికి వ్యతిరేకింగా రిట్ పిటిషన్ వేశారు. దీంతో ఈ కేసు విషయమై సుప్రీంకోర్టు ఎలా స్పందించబోతోంది..? ఎలాంటి తీర్పునివ్వబోతోంది..? అన్న ఉత్కంఠ ఫిరాయింపు ఎమ్మెల్యేలలో కనిపిస్తోంది.

Tags:    

Similar News