"మహిళ శరీర నిర్మాణం"పై కామెంట్స్... హైకోర్టు సంచలన తీర్పు!
మహిళల శరీరాకృతి బాగుందని వ్యాఖ్యానించడం.. లైంగికంగా సూచించే మెసేజ్ లు పంపించడం లైంగిక వేధింపులతో సమానమని కేరళ హైకోర్టు వ్యాఖ్యానించింది.
మహిళల శరీరాకృతి బాగుందని వ్యాఖ్యానించడం.. లైంగికంగా సూచించే మెసేజ్ లు పంపించడం లైంగిక వేధింపులతో సమానమని కేరళ హైకోర్టు వ్యాఖ్యానించింది. సహోద్యోగి శారీరక సౌందర్యం గురించి వ్యాఖ్యలు చేయడం, ఫోన్ లో లైంగికంగా సూచించే మెసేజ్ లు పంపడంపై లైంగిక వేధింపులకు సంబంధించిన సెక్షన్స్ కింద నమోదైన కేసులో కోర్టు ఈ విధంగా స్పందించింది.
అవును... మహిళల శరీర నిర్మాణం, ఆకృతి గురించి వ్యాఖ్యానించడం.. వాటికి సంబంధించిన మెసేజ్ లు పంపించడం లైంగిక వేధింపులతో సమానమని కేరళ హైకోర్టు పేర్కోంది! మహిళ శరీర నిర్మాణంపై వ్యాఖ్యానించడం, జెండర్ కలర్ తో కూడిన వ్యాఖ్యలు చేయడం వంటివి లైంగిక వేధింపులతో సమానమని హైకోర్టు తీర్పులో వెల్లడించింది. ఈ విషయం ఇప్పుడు ఆసక్తిగా మారింది.
వివరాళ్లోకి వెళ్తే... కేరళ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు లిమిటెడ్ (కేఎస్ఈబీ) మాజీ ఉద్యోగి అయిన నిందితుడు 2017లో ఫిర్యాదుదారుని శరీరంపై లైంగిక రంగుల వ్యాఖ్యలు చేయడంతో పాటు.. ఆమెకు అనుచిత సందేశాలు పంపించారట. ఇందులో భాగంగా.. ఆ ఏడాది మార్చి 31న వర్కింగ్ హవర్స్ లో లైంగిక ఉద్దేశ్యంతో తన శరీర నిర్మాణంపై వ్యాఖ్యానించాడని ఫిర్యాదుదారు ఆరోపించారు.
ఇదే క్రమంలో.. అదే ఏడాది జూన్ 15, 17, 20 తేదీల్లో కూడా ఇలాంటివి మరికొన్ని సంఘటనలు జరిగాయని.. తన ఫోన్ కు అనుచిత ఎస్సెమ్మెస్ లు పంపించారని ఆమె వెల్లడించింది. వాస్తవానికి ఈ తరహా ప్రవర్తన 2013 నుంచే చేస్తున్నట్లు ఫిర్యాదుదారు ఆరోపించింది. దీనిపై కేఎస్ఈబీ అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ వేధింపులు కొనసాగించాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.
ఈ సమయంలో.. ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడి తరుపు న్యాయవాది వాదిస్తూ... సెక్షన్ 354 ఏ(1)(4), ఐపీసీ 509, కేరళ పోలీస్ యాక్ట్ సెక్షన్ 120(ఒ) ప్రకారం ఆమె చేసిన ఆరోపణలు నేరాలుగా పరిగణించబడవని.. శరీర నిర్మాణాన్ని సూచించే వ్యాఖ్యలను లైంగిక వేధింపులుగా వర్గీకరించలేమని పేర్కొన్నారు.
ఈ సమయంలో నిందితుడిపై వచ్చిన ఆరోపణలను విశ్లేషించిన కోర్టు తాజాగా తీర్పు వెల్లడించింది. ఇందులో భాగంగా... ఏ వ్యక్తి అయినా స్త్రీని ఉద్దేశించి సెక్స్యువల్ కలర్డ్ కామెంట్స్ చేస్తే అది లైంగిక వేధింపుల నేరానికి పాల్పడినట్లేనని పేర్కొంది. ఇలాంటి వ్యాఖ్యలు సెక్షన్ 354 ఏ (1) (4) కిందకు వస్తాయని నొక్కి చెప్పింది.
ఇదే సమయంలో... బాధితురాలికి పిటిషనర్ పలుమార్లు పంపిన మెసేజ్ లు కేరళ పోలీస్ యాక్ట్ సెక్షన్ 120 (ఒ) ప్రకారం నేరంగా పరిగణించబడుతుందని వ్యాఖ్యానించింది. నిందితులపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను ఈ సందర్భంగా హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసును కొనసాగించాలని ఆదేశించింది.