ట్యాపింగ్ ఎపిసోడ్ లో కోర్టుకు శ్రవణ్ రావు అఫిడవిట్
ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ ఎంతటి సంచలనానికి కారణమైందన్న సంగతి తెలిసిందే.
ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ ఎంతటి సంచలనానికి కారణమైందన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధించి అధికారులు వెల్లడించిన సమాచారం చాలా చాలా తక్కువ. పలు మీడియా సంస్థలకు చెందిన విలేకరులు తమకున్న సత్ సంబంధాలతో ట్యాపింగ్ అంశాలకు సంబంధించిన వార్తల్ని కవర్ చేయటం తెలిసిందే. రేవంత్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత తెర మీదకు వచ్చిన ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ లో ఒక మీడియా సంస్థకు అధినేతగా వ్యవహరిస్తున్న శ్రవణ్ రావుపై పలు ఆరోపణలు రావటం తెలిసిందే.
అయితే.. శ్రవణ్ రావు సైతం విదేశాల్లో ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆయన ఆచూకీపై అధికారులు పెద్ద ఎత్తున సమాచారం సేకరిస్తున్న వేళ.. శ్రవణ్ రావు నాంపల్లి కోర్టుకు తన అఫిడవిట్ ను దాఖలు చేవారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనపై పోలీసులు నమోదు చేసిన సీఆర్పీసీ 73 సెక్షన్ సరికాదన్నఆయన.. తన అరెస్టుకు అనుమతి ఇవ్వాలంటూ కోరిన పిటిషన్ ను కొట్టేయాలంటూ ఆయన తన అఫిడవిట్ సమర్పించారు.
ఈ సందర్భంగా ఆయన పలు అంశాల్ని ప్రస్తావించారు. ఫోన్ ట్యాపింగ్ ఉదంతంలో తనకు ఎలాంటి సంబంధం లేదన్న శ్రవణ్ రావు.. తాను ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడింది లేదన్నారు. ముందుగా షెడ్యూల్ చేసుకున్న బిజినెస్ షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది మార్చి 15న తాను లండన్ వెళ్లినట్లుగా పేర్కొన్నారు. అయితే.. తన సోదరి అమెరికాలో ఉంటుందని.. ఆమెకు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పారు.
తన బావ వినతి మేరకు తన సోదరి బాగోగులు చూసుకునేందుకు మార్చి 20న అమెరికాకు వెళ్లినట్లుగా చెప్పారు. తాను అమెరికా నుంచి తిరిగి వచ్చే వరకు తాను ఫోన్ లో అందుబాటులో ఉంటానని పేర్కొన్న శ్రవణ్ రావు.. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత కేసు దర్యాప్తునకు సహకరిస్తానని పేర్కొన్నారు. మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ మీద తన పాత్ర లేదంటూ స్పష్టం చేస్తున్న శ్రవణ్ రావు అఫిడవిట్ పై కోర్టు ఏ రీతిలో రియాక్టు అవుతుందన్నది ఇప్పుడు ఉత్కంటగా మారింది.