వరుస ఎదురుదెబ్బల నడుమ వైసీపీకి భారీ ఊరట : రెండు కేసుల్లో 20 మందికి బెయిల్

అయితే బెయిల్ పొందిన నిందితులు ఎవరూ దేశం విడిచి వెళ్లకూడదని ఆంక్షలు విధించింది.

Update: 2025-02-25 09:27 GMT

దెబ్బ మీద దెబ్బ తింటూ కోర్టులు, పోలీసు స్టేషన్ల చుట్టూ తిరుగుతున్న వైసీపీ నేతలకు ఈ రోజు ఊరట దక్కింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇళ్లు, టీడీపీ కార్యాలయంపై దాడి కేసుల్లో నిందితులుగా ఉన్న వైసీపీ కీలక నేతలకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే బెయిల్ పొందిన నిందితులు ఎవరూ దేశం విడిచి వెళ్లకూడదని ఆంక్షలు విధించింది.

ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం, టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసుల్లో నిందితులు దాఖలుచేసుకున్న బెయిల్ పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. మాజీ మంత్రి జోగి రమేశ్ తోపాటు వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాశ్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, సీనియర్ నేత తలశిల రఘురాంతోపాటు మొత్తం 20 మందికి బెయిల్ మంజూరు చేసింది.

నిందితులు మూడేళ్లుగా బెయిల్, ముందస్తు బెయిల్ కోరలేదని, ప్రభుత్వం మారిన వెంటనే కోర్టు మెట్లు ఎక్కారంటూ ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు నివేదించారు. తాము తప్పు చేశామని తెలిసినా నిందితులు ప్రభుత్వం మారిన వెంటనే కోర్టును ఆశ్రయించారని న్యాయవాది తెలిపారు. జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి ఇంటిపై దాడి చేశారు. తిరిగి ఆయనపై ఎదురు కేసు పెట్టించారు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో దేవినేని అవినాశ్ ప్రధాన సూత్రధారి, పాత్రధారి, ఆయన దర్యాప్తునకు సహకరించడం లేదని కోర్టు దృష్టి తీసుకువెళ్లారు.

అయితే ప్రభుత్వ న్యాయవాది వాదనలను విన్న సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘మూడేళ్లుగా దర్యాప్తు జరగకుండా తాత్సారం చేశార. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ పూర్తిగా ఉల్లంఘించారు. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ నిందితులు పిటిషన్లు దాఖలుచేశారు. ఈ కేసులో జోక్యం చేసుకునేందుకు కారణాలు కనిపించడంలేదు. జోగి రమేశ్, దేవినేని అవినాశ్ దేశం విడిచి వెళ్లొద్దు. వీరిద్దరూ దర్యాప్తునకు సహకరించాల్సిందే’’ అని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Tags:    

Similar News