అదేం భాష? మీ బుర్రలోని చెత్త.. సుప్రీం నిప్పులు

విచారణ సందర్భంగా ‘‘ఇదంతా అసభ్యత కాకపోతే ఏమిటి? మీ మెదడులోని చెత్తనంతా ఆ ప్రోగ్రాం ద్వారా బయటపెట్టారు.

Update: 2025-02-18 07:36 GMT

క్రికెటర్లు.. సొసైటీలోని ప్రముఖులను ఇంటర్వ్యూలు చేస్తూ..

అత్యంత పాపులారిటీ సంపాదించుకుని.. అథపాతాళంలోకి పడిపోయిన వ్యక్తి రణవీర్ అల్హాబాదియా. దీరూబాయి అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ లో చదువుకుని.. డాక్టర్ కుమారుడై ఉంది.. ఇంజనీరింగ్ కూడా చేసిన అతడు ఇటీవల ఇండియాస్‌ గాట్‌ లాటెంట్‌’(ఐజీఎల్)లో అత్యంత నీచమైన వ్యాఖ్యలు చేశాడు.

రణవీర్ అల్హాబాదియా వ్యాఖ్యలు ఎంత దారుణంగా ఉన్నాయంటే.. మనిషి నైతికంగా పతనానికి అంతకంటే మరొక పద్ధతి లేదనేంతగా అన్నమాట. మన సమాజంలో తల్లిదండ్రులు, గురువులను దైవంగా పూజిస్తాం. అలాంటి తల్లిదండ్రుల లైంగిక జీవితం గురించి బహిరంగంగా మాట్లాడడంతో రణవీర్ పై సమాజంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అతడిపై కేసు నమోదు చేయాలంటూ నేరుగా మహారాష్ట్ర సీఎం ఆదేశించేవరకు వ్యవహారం వెళ్లింది. సొంత రాష్ట్రం మహారాష్ట్రలోనే కాక ఇతర రాష్ట్రాల్లోనూ రణవీర్ పై కేసుల నమోదు, తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. సమయ్‌ రైనా షోలో రణవీర్ అల్హబాదియా చేసిన వ్యాఖ్యలపై పలువురు పార్లమెంటు సభ్యులు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు.

పలు రాష్ట్రాల్లో ఎఫ్‌ఐఆర్‌ లు నమోదు కావడంతో రణవీర్ వాటిపై ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అన్ని ఎఫ్ఐఆర్ లను క్లబ్‌ చేయాలని పిటిషన్‌ వేశాడు. దీనిపై మంగళవారం విచారణ జరిగింది.

విచారణ సందర్భంగా ‘‘ఇదంతా అసభ్యత కాకపోతే ఏమిటి? మీ మెదడులోని చెత్తనంతా ఆ ప్రోగ్రాం ద్వారా బయటపెట్టారు. ఇలాంటి ప్రవర్తన ఖండించదగినది. పాపులర్ అని చెప్పి, ఏదైనా మాట్లాడతా అంటే సమాజం ఆమోదించదు. మీలాంటి వ్యక్తులకు కోర్టు ఎందుకు రక్షణ కల్పించాలి’’ అని సుప్రీం ప్రశ్నించింది.

రణవీర్‌ వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తీవ్రంగా ఖండిస్తూ అసహనం వ్యక్తంచేసింది. ఇలాంటి భాష ఎవరికైనా నచ్చుతుందా..? అని నిలదీసింది. పాపులారిటీ ఉంటే ఏదైనా మాట్లాడతారా..? మీరు వాడిన భాషను ఎవరైనా ఇష్టపడతారా..? అంటూ రణవీర్ పై సుప్రీం నిప్పులు చెరిగింది. తీవ్రంగా మందలించిన సుప్రీంకోర్టు.. తర్వాత ఊరట కల్పించింది. ఈ వ్యవహారంలో మరో పోలీసు కేసు నమోదు చేయొద్దని ఆదేశించింది. కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచివెళ్లే ప్రయత్నాలు చేయొద్దని హెచ్చరించింది. పాస్ పోర్టును ఠాణె పోలీసులకు అప్పగించాలని, తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఎలాంటి షోలు చేయొద్దని తేల్చిచెప్పింది.

Tags:    

Similar News