దిల్ రాజు కు ఊరట ఇస్తూనే వార్నింగ్ ఇచ్చిన సుప్రీం!

ఈ మూవీని తన నవల ఆధారంగా కాపీ చేశారంటూ రచయత పెట్టిన కేసుకు సంబంధించిన వివాదం సుప్రీంకోర్టు విచారణలో ఉన్న విషయం తెలిసిందే.

Update: 2025-02-25 05:00 GMT

డార్లింగ్ ప్రభాస్ నటించిన మిస్టర్ పర్ ఫెక్ట్ మూవీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాక్సాఫీస్ దగ్గర ఘన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ మూవీని తన నవల ఆధారంగా కాపీ చేశారంటూ రచయత పెట్టిన కేసుకు సంబంధించిన వివాదం సుప్రీంకోర్టు విచారణలో ఉన్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఈ కేసుకు సంబంధించి చిత్ర నిర్మాత దిల్ రాజుకు ఒకింత ఊరటతో పాటు.. అంతలోనే హెచ్చరిక కూడా జారీ అయ్యింది. ఇంతకూ ఈ మూవీ గురించి తాజా విచారణ వేళ.. నిర్మాత దిల్ రాజుకు.. దర్శకుడు దశరథ్ కు సుప్రీం ఏం చెప్పింది? అన్న విషయంలోకి వెళితే.. ఒకింత ఊరటను ఇస్తూనే.. మరోవైపు హెచ్చరికను జారీ చేయటం కనిపిస్తుంది.

‘నా మనసు కోరింది నిన్నే’ నవల ఆధారంగా మోసపూరితంగా సినిమా తీసి తన హక్కులకు భంగం కలిగించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ రచయిత ముమ్మిడి శ్యామలారాణి కేసు నమోదు చేశారు. ట్రయల్ కోర్టులో జరుగుతున్న విచారణ ప్రక్రియపై సుప్రీంకోర్టు తాత్కాలిక స్టే విధించింది. అయితే.. ఈ సమస్యను పరిష్కరించుకోవటానికి ప్రయత్నించాలని.. లేదంటే ఇబ్బందుల్లో పడతారంటూ దర్శక నిర్మాతల తరఫున హాజరైన సీనియర్ లాయర్ నిరంజన్ రెడ్డిని సుప్రీం ధర్మాసనం హెచ్చరించటం గమనార్హం.

ఈ వ్యవహారంపై దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన సందర్భంగా జస్టిస్ జేబీ పార్దీవాలా.. జస్లిస్ మహాదేవన్ లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. దిల్ రాజు తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ కేసును ఇదివరకే హైకోర్టు కొట్టేసిందని.. సీఆర్ పీసీ సెక్షన్ 468 కింద ఉన్న కాలపరిమితిని పరిగణలోకి తీసుకొని కాపీ రైట్ యాక్టు సెక్షన్ 63ను కొట్టేయాలని కోర్టును కోరారు.

మిస్టర్ పర్ ఫెక్ట్ మూవీని 2011 ఏప్రిల్ 20న విడుదలైందని.. తన నవల ఆధారంగా సినిమా తీశారని రచయిత 2017 జులై 12న కేసు నమోదు చేసినట్లుగా పేర్కొన్నారు.దీనికి స్పందించిన ధర్మాసనం.. ఈ సినిమా కంటిన్యూగా టీవీల్లో ప్రసారమవుతోంది కాబట్టి ప్రాథమికంగా ఇది నిరంతరం సాగే నేరంగానే కనిపిస్తోందని.. ఈ అంశాన్ని తాము పరిశీలించాలని అనుకుంటున్నట్లుగా స్పష్టం చేశారు. ప్రతివాదికి నోటీసులు జారీ చేస్తూ రెండు వారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశించారు. అదే సమయంలో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘సమస్య పరిష్కరానికి ప్రయత్నించండి. లేదంటే మీరు ఇబ్బందులలో పడతారు’ అంటూ సీనియర్ న్యాయవాదికి సుప్రీం ధర్మాసనంలోని న్యాయమూర్తి పేర్కొన్నారు.

Tags:    

Similar News