‘అతి’ కాకుంటే సుప్రీం చివాట్లు పెట్టే వరకు గవర్నర్ తెచ్చుకోవాలా?

పదవి ఏదైనా విధేయత తప్పనిసరి. కాకుంటే.. ఏ కుర్చీలో కూర్చుంటే ఆ కుర్చీ ఎవరికి విధేయుడిగా ఉండాలో స్పష్టంగా చెబుతుంది.

Update: 2024-03-22 11:30 GMT

పదవి ఏదైనా విధేయత తప్పనిసరి. కాకుంటే.. ఏ కుర్చీలో కూర్చుంటే ఆ కుర్చీ ఎవరికి విధేయుడిగా ఉండాలో స్పష్టంగా చెబుతుంది. కానీ.. అలాంటివేమీ పట్టించుకోకుండా మొండితనంతో వ్యవహరిస్తే వచ్చే నష్టం ఇప్పుడు కళ్ల ముందుకు కనపడేలా చేస్తోంది. తాజాగా తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయటం సంచలనంగా మారింది. మన వ్యవస్థలో ఎవరి పరిధి ఏమిటన్న దానిపై స్పష్టమైన హద్దులు ఉన్నాయి. అందుకు భిన్నంగా రాజ్యాంగ పదవుల్లో కూర్చొని రాజకీయ నాయకుడిలా వ్యవహరించే తీరు ఏ మాత్రం మంచిది కాదన్న విషయాన్ని మర్చిపోవటమే అసలు సమస్య.

ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో శిక్ష పడి సుప్రీంకోర్టు ఊరట పొందిన తమిళనాడు అధికార డీఎంకేకు చెందిన ఎమ్మెల్యే కె.పొన్ముడితో మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించాలన్న ముఖ్యమంత్రి స్టాలిన్ నిర్ణయాన్ని లైట్ తీసుకున్న గవర్నర్ వ్యవహారశైలి మీద దేశ అత్యున్నత న్యాయస్థానం నిప్పులు చెరిగింది. ఈ ఎపిసోడ్ ను చూసినప్పుడు కలిగేదొక్కటే.. ఎవరు కూడా తమ స్థాయిని దాటకూడదన్న విషయాన్ని మర్చిపోవటమే అసలు సమస్యగా అర్థమవుతుంది.

మంత్రిగా పొన్ముడి చేత ప్రమాణస్వీకారం చేయించే విషయంలో గవర్నర్ వ్యవహరించిన తీరు ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తగా.. తాజాగా సుప్రీంకోర్టు సైతం ఇదే అంశాన్ని మరింత ఘాటుగా చెప్పింది. మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించనని గవర్నర్ ఎలా చెబుతారని ప్రశ్నించింది. రాజ్యాంగ పరిరక్షణకు రక్షకుడిగా వ్యవహరించే గురుతర బాధ్యత పోషించాల్సిన గవర్నరే.. తాను రాజ్యాంగాన్ని అమలు చేయనని అంటే ఏం చేయాలి? ఇదే విషయాన్ని ప్రస్తావించిన సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది.

సుప్రీంకోర్టు ఆదేశాల్నే ధిక్కరించటాన్ని ప్రశ్నించిన ధర్మాసనం.. గవర్నర్ రవి తీరును తాము తేలిగ్గా తీసుకోబోమని.. తగిన చర్యలకు ఆదేశిస్తామని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా గవర్నర్ తీరుపై వివరణ తీసుకోవాలని చెప్పటమే కాదు.. శుక్రవారంలోపు పొన్ముడితో ప్రమాణస్వీకారం చేయించాలన్న గడువును నిర్దేశించటం గమనార్హం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేత్రత్వంలోని ధర్మాసనం జారీ చేసిన ఆదేశాల్ని చూసిన తర్వాత.. సుప్రీంకోర్టు కర్ర పట్టుకొని తన అధికారాల్ని గుర్తు చేయిస్తే తప్పించి వ్యవస్థలు నడవని పరిస్థితిని ఎలా చూడాలి? అలాంటి వాటికి కొమ్ము కాస్తున్న రాజకీయాల్ని మరెలా చూడాలన్నది ఇప్పుడు ప్రశ్న.

ఈ ఎపిసోడ్ ను చూస్తే ఒక అంశం ఆందోళన కలిగిస్తుంది. స్వతంత్ర భారతంలో ఇప్పటివరకు ఒక ఎమ్మెల్యేను మంత్రిగా ప్రమాణ స్వీకారంచేయించనని గవర్నర్ చెప్పటం ఇదే తొలిసారి. అంతేకాదు.. తరచూ ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటాన్నిపలువురు తప్పు పడుతున్నారు. ఇలాంటి సంప్రదాయం ప్రజాస్వామ్య వ్యవస్థకు ఏ మాత్రం మంచిది కాదు. ఇలాంటి గవర్నర్ల విషయంలో తాము చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన సుప్రీంకోర్టు.. ఆ పని చేతల్లో చేసేస్తే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తమిళనాడు గవర్నర్ వ్యవహారం దేశంలోని గవర్నర్ల వ్యవస్థకు ఒక పాఠంగా మారాల్సిన అవసరం ఉంది.

Tags:    

Similar News