'అమరావతి' కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!

రాజధాని అమరావతికి సంబంధించిన కేసుల విచారణను సుప్రీంకోర్టు ఏప్రిల్‌ కు వాయిదా వేసింది.

Update: 2024-01-03 10:58 GMT

రాజధాని అమరావతికి సంబంధించిన కేసుల విచారణను సుప్రీంకోర్టు ఏప్రిల్‌ కు వాయిదా వేసింది. ఆ నెలలో వాదనలు వింటామని న్యాయమూర్తులు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాలతో కూడిన ధర్మాసనం వెల్లడించింది. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు 2022 మార్చిలో తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే అమరావతి మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం నిర్దేశిత కాలపరిమితిలోగా అమరావతిలో పనులు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపుతట్టింది. రాజ్యాంగం ప్రకారం మూడు వ్యవస్థలు తమ తమ అధికార పరిధుల్లో పని చేయాలని తన పిటిషన్‌ లో పేర్కొంది. శాసన, పాలన వ్యవస్థ అధికారాల్లోకి న్యాయవ్యవస్థ చొరబడటం రాజ్యాంగ మౌలిక వ్యవస్థకు విరుద్ధం అని తెలిపింది. దీనిపై సుప్రీంకోర్టులో పలుమార్లు విచారణ జరిగింది. ఇందులో భాగంగా ఏపీ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి విధించిన కొన్ని గడువులపై సుప్రీంకోర్టు ధర్మాసనం స్టే విధించింది. అయితే అమరావతే రాజధాని అనే విషయంపై మాత్రం స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.

తాజాగా జనవరి 3న జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా ధర్మాసనం ముందు కేసు విచారణకు వచ్చింది. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. మూడు రాజధానుల చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుందని తెలిపారు. కాబట్టి దానిపై తీర్పు నిరర్ధకమని నివేదించారు.

ప్రభుత్వ వాదనలను రాజధాని ప్రాంత రైతుల తరఫున సీనియర్‌ న్యాయవాది దేవదత్‌ కామత్‌ తోసిపుచ్చారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు నిరర్ధకమేమీ కాదని.. ఒరిజినల్‌ మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం అమరావతిని ఎలా అభివృద్ధి చేయాలో చెబుతూ ఉన్నత న్యాయస్థానం కాలపరిమితి విధించిందని అన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం తదుపరి విచారణను ఏప్రిల్‌ లో చేపడతామని వెల్లడించింది. అంతకంటే ముందే విచారించాలని.. లేదంటే ఏప్రిల్‌ లో విచారించే వారాన్ని అయినా చెప్పాలని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది కోరారు. అయితే అందుకు న్యాయమూర్తి తిరస్కరించారు.

విచారణను ఏప్రిల్‌కు వాయిదా వేసిన సుప్రీం.. ఈ లోగా అన్ని పక్షాలు తమ కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది.

Tags:    

Similar News