వైసీపీ నేతలకు హైకోర్టు షాక్

వైసీపీ ప్రభుత్వ హయాంలో మంగళగిరిలోని టీడీపీ ఆఫీసుపై వైసీపీ నేతలు దాడి చేసిన ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే.

Update: 2024-09-04 13:58 GMT

వైసీపీ ప్రభుత్వ హయాంలో మంగళగిరిలోని టీడీపీ ఆఫీసుపై వైసీపీ నేతలు దాడి చేసిన ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ దాడికి పాల్పడిన వైసీపీ నేతలు జోగి రమేష్, లేళ్ల అప్పిరెడ్డి, తలసిల రఘురాం, నందిగం సురేష్, దేవినేని అవినాష్ లతో పాటు మరికొందరు వైసీపీ నాయకులపై కేసులు నమోదయ్యాయి. అయితే, తమకు ముందస్తు బెయిల్ కావాలంటూ ఏపీ హైకోర్టులో ఆ నేతలు పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఆపరేషన్ పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు వారికి షాక్ ఇచ్చింది.

బెయిల్ కోసం వారు దాఖలు చేసుకున్న పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో, వారికి హైకోర్టులో చుక్కెదురైనట్లుంది. అయితే ఆ నాయకులపై రెండు వారాల వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దంటూ ఏపీ పోలీసులను ఆదేశించాలని వైసీపీ నేతల తరఫున న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు. దాంతోపాటు ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఇవ్వాలని కోరారు.

హైకోర్టు ఉత్తర్వులను రెండు వారాల పాటు సస్పెండ్ చేయాలని కోరారు. అందుకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు ఉందని వాదనలు వినిపించారు.

అయితే, సుప్రీంకోర్టు తీర్పు అలా లేదని టీడీపీ న్యాయవాదులు తీర్పు కాపీ ఇచ్చారు. అన్నింటినీ పరిశీలించిన హైకోర్టు తుది ఉత్తర్వులను ఈ రోజు వెల్లడిస్తామని ప్రకటించింది. అయితే, వారిపై 2 వారాల వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దంటూ ఇప్పటికే హైకోర్టు ఆదేశించింది. మరోవైపు, ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంపై దాడి కేసులో మధ్యంతర బెయిల్ కోరుతూ మాజీ మంత్రి జోగి రమేష్ దాఖలు చేసిన ప్రత్యేక పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది.

Tags:    

Similar News