ఆదివారం మీరు ఎందుకు పనిచేయాలి? హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం

రెండు నెలల క్రితం ఏర్పాటైన హైడ్రా ఇప్పటివరకు అక్రమ కట్టడాలను కూల్చి ఎకరాల భూమిని ప్రభుత్వానికి రికవరీ చేశారు.

Update: 2024-09-30 06:53 GMT

రెండు నెలల క్రితం ఏర్పాటైన హైడ్రా ఇప్పటివరకు అక్రమ కట్టడాలను కూల్చి ఎకరాల భూమిని ప్రభుత్వానికి రికవరీ చేశారు. హైడ్రా పనితీరును కొంత మంది పాజిటివ్ గా తీసుకుంటే.. కొన్ని పార్టీల నుంచి మాత్రం నిరసన ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇదిలా ఉండగా.. హైడ్రాపై పలువురు బాధితులు ఇప్పటికే హైకోర్టును కూడా ఆశ్రయించారు. పలుమార్లు విచారణ చేపట్టిన హైకోర్టు పలు సందర్భాల్లో హైడ్రాకు కొన్ని సూచనలు చేసింది.

ఇటీవల అమీన్‌పూర్ ఘటనపై విచారణ చేపట్టిన హైకోర్టు.. హైడ్రా కమిషనర్‌ను విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. కోర్టు పరిధిలో ఉన్న భవనాన్ని కూల్చడంపై దాఖలైన పిటిషన్‌పై ఈ ఆదేశాలు ఇచ్చింది. ప్రత్యక్షంగా లేదంటే వర్చువల్‌గానూ అటెండ్ కావచ్చని సూచించింది. దాంతో ఈ రోజు హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైకోర్టు విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా హైకోర్టు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పలు ప్రశ్నలకు సమాధానం కోరింది. ఈ కేసు విషయమై అక్కడి తహశీల్దార్ నేరుగా విచారణకు హాజరయ్యారు.

అందులోనూ ముఖ్యంగా శని, ఆదివారాల్లోనూ ఎందుకు కూల్చివేతలు చేస్తూన్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సూర్యాస్తమయం తరువాత ఎందుకు కూల్చివేతలు చేపడుతున్నారని నిలదీసింది. ‘ఆదివారం మీరు ఎందుకు పనిచేయాలి?’ అని ప్రశ్నించింది. సెలవుల్లోనే ఎందుకు నోటీసులు ఇచ్చి కూల్చివేస్తున్నారని అడిగింది. శని, ఆదివారాల్లో కూల్చివేతలు వద్దని గతంలో కోర్టు తీర్పులున్నాయని, వాటిని ఎందుకు పాటించడంలేదని గుర్తుచేసింది.

చట్టాన్ని ఉల్లంఘించి కూల్చివేతలు చేస్తున్నారని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. చార్మినార్‌ను కూల్చివేయాలని అక్కడి ఎమ్మార్వో చెబితే వెళ్లి కూల్చేస్తారా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తాను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలని, దానిని స్కిప్ చేసే ప్రయత్నం చేయొద్దని ఆదేశించింది. అమీన్‌పూర్‌పైనే మాట్లాడాలని, కావూరి హిల్స్ గురించి తాను అడగలేదని సీరియస్ అయింది. అక్రమ కట్టడాలు కడుతుంటే వాటిని నిలిపివేయాలని, లేదంటే సీజ్ చేయాలని సూచించింది. కానీ.. నిబంధనలు ఉల్లంఘించి ఆదివారాల్లో కూల్చడం ఏంటని ప్రశ్నించింది. హైడ్రాను అభినందిస్తున్నామని, కానీ హైడ్రా వ్యవహరిస్తున్న తీరు బాగోలేదని హైకోర్టు అభిప్రాయపడింది.

Tags:    

Similar News