వంశీ ఇప్పట్లో బయటకు రారేమో?
వైసీపీ నేత కం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టైం ఏ మాత్రం బాగోలేదు. ఆయన చేస్తున్న ప్రయత్నాలకు ఎదురుదెబ్బ తగులుతోంది.;
వైసీపీ నేత కం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టైం ఏ మాత్రం బాగోలేదు. ఆయన చేస్తున్న ప్రయత్నాలకు ఎదురుదెబ్బ తగులుతోంది. తాజాగా ఆయనకు కోర్టు నుంచి షాక్ ఎదురైంది. ఎమ్మెల్యేగా ఉన్న వేళలో చట్టవ్యతిరేకంగా బెదిరింపులకు పాల్పడి వారి ఆస్తుల్ని లాక్కున్నట్లుగా ఉన్న ఆరోపణల నేపథ్యంలో.. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని వల్లభనేని వంశీ కోరారు.
అయితే.. ఈ తరహా కేసులలో ముందస్తు బెయిల్ ఇచ్చే విచక్షణాధికారాన్ని తాను వినియోగించలేనని పేర్కొన్నారు విజయవాడ 12వ అదనపు జిల్లా జడ్జి రిజెక్టు చేశారు. ఇంతకూ వంశీ మీద ఉన్న కేసు ఏమిటంటే.. గత ప్రభుత్వంలో వంశీ ఎమ్మెల్యేగా ఉండేవారు. ఆ సమయంలో ఒక భూవివాదాన్ని పరిష్కరిస్తానని తమను పిలిచి.. తన బినామీ పేర్ల మీద ఆ భూమల్ని రాయించుకున్నట్లుగా ఆరోపించారు.
విజయవాడకు చెందిన హైకోర్టు న్యాయవాది సుంకర క్రిష్ణమూర్తి.. తనకు ఎదురైన చేదు అనుభవంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ వ్యవహారంలో వల్లభనేని వంశీని ఏ1గా చేరుస్తూ గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వంశీ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఈ కేసులో ముందస్తు బెయిల్ తాను జారీ చేయలేనని స్పష్టం చేస్తూ.. వంశీ పిటిషన్ ను డిస్మిస్ చేశారు.
ఈ కేసులో వంశీకి ఎలాంటి సంబంధం లేదని.. అయినా కేసు నమోదు చేశారని.. కేసును కొట్టేయాలంటూ వంశీ తరఫు లాయర్ బలమైన వాదనల్ని వినిపించారు. అయితే.. దీనిపై పిటిషనర్ తరఫు లాయర్ తన వాదనను వినిపిస్తూ..వంశీ తన అనుచరులనుపెట్టి బినామీ పేర్లతో సేల్ డీడ్ రాయించుకున్నారన్నారు. ఈ అంశంపై మరిన్ని వివరాలు బయటకు రావాలంటే ఆయన్ను కస్టడీకి తీసుకొని విచారించాల్సి ఉందని వాదనలు వినిపించారు. ముందస్తుబెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదని కోరారు. ఈ నేపథ్యంలో పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనల్ని పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి.. వంశీకి ముందస్తు బెయిల్ ఇవ్వటం కుదరదని తేల్చేశారు.