కీలక పరిణామం.. వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దవుతుందా?
ఈ సందర్భంగా దస్తగిరి తరఫున న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు.
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల ముంగిట మరోసారి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తమ్ముడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు సంచలన పరిణామాలకు దారితీస్తోంది. ఓవైపు వైఎస్ వివేకా హత్యపై ‘వివేకం’ బయోపిక్ తెరకెక్కింది. ఇంకోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ తమ ఎన్నికల ప్రచారాల్లో హత్య వ్యవహారాన్ని లేవనెత్తుతున్నారు.
ఈ హత్యలో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని తాజాగా పిటిషన్ దాఖలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది సర్వత్రా ప్రాధాన్యత సంతరించుకుంది.
వివేకా హత్య కేసులో బెయిలుపై ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డి సాక్షులను బెదిరిస్తున్నారని, ప్రభావితం చేస్తున్నారని.. అందువల్ల ఆయన బెయిలు రద్దు చేయాలని కోరుతూ ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు.
ఈ నేపథ్యంలో ఈ కేసును విచారించిన తెలంగాణ హైకోర్టు.. వివేకా హత్య కేసులో సాక్షులను ప్రభావితం చేస్తూ షరతులను ఉల్లంఘిస్తున్నారని తెలిసినప్పుడు నిందితుడైన వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిలును రద్దు చేయాలని మీరెందుకు కోరలేదంటూ సీబీఐని ప్రశ్నించింది. తనను బెదిరిస్తున్నారని డిసెంబరులో దస్తగిరి ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. హత్య కేసులో ప్రధాన నిందితుడైన దస్తగిరి లేకుండా ఏం జరుగుతుందో తెలియదా అని సీబీఐని కోర్టు నిలదీసింది.
ఈ సందర్భంగా దస్తగిరి తరఫున న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు. నిందితుడు అవినాష్ రెడ్డి బెయిలు షరతులను ఉల్లంఘించారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఆయన అనుచరులు దస్తగిరి తండ్రిపై దాడి చేసి గాయపరిచారని కోర్టుకు నివేదించారు. తమకు అనుకూలంగా సాక్ష్యం చెప్పకపోతే దస్తగిరి కుటుంబానికి ఇబ్బందులు తప్పవని హెచ్చరించారని తెలిపారు. ఇప్పటికే దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశామని జడ శ్రావణ్ కుమార్ కోర్టుకు వివరించారు.
ఈ నేపథ్యంలో సాక్షులకు రక్షణ అవసరమని, లేదంటే నిందితులు సాక్ష్యాలను తారుమారు చేస్తారని శ్రావణ్ కుమార్ కోర్టుకు నివేదించారు. ఇప్పటికే తమకు అనుకూలంగా సాక్ష్యం చెప్పినట్టయితే రూ.20 కోట్లు ఇస్తామంటూ నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి.. దస్తగిరికి ఆఫర్ ఇచ్చాడని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో బెయిల్ షరతులు ఉల్లంఘించిన అవినాష్ బెయిల్ ను రద్దు చేయాలని విన్నవించారు.
అవినాష్ రెడ్డి తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది టి.నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిలును రద్దు చేయాలంటూ సీబీఐ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయలేదని గుర్తు చేశారు. బెయిలు రద్దు కోరే అర్హత మూడో వ్యక్తి (దస్తగిరి)కి లేదన్నారు.
కాగా అవినాష్ రెడ్డి బెయిలు రద్దు చేయాలన్నదే తమ అభిప్రాయం కూడానని సీబీఐ తరఫు న్యాయవాది వెల్లడించారు. అలాంటప్పుడు అవినాష్ రెడ్డి బెయిలు రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఎందుకు కోరలేదని సీబీఐని కోర్టు నిలదీసింది. సీబీఐ ప్రభుత్వ సంస్థ అని, అనుమతులన్నీ రావడానికి సమయం పడుతుందని సీబీఐ న్యాయవాది చెప్పారు.
ఈ నేపథ్యంలో అందరి వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను ఏప్రిల్ 15కి వాయిదా వేశారు. అలాగే వివేకా హత్య కేసులో నిందితులైన వైఎస్ భాస్కరరెడ్డి, ఉదయ్‌కుమార్ రెడ్డి దాఖలు చేసిన బెయిలు పిటిషన్లపై విచారణను ఏప్రిల్ 8కి వాయిదా వేశారు.