కాలిఫోర్నియాలో కాల్పులు... మరో ఇండియన్ టీన్ బలి!
యునైటెడ్ స్టేట్స్ లో కాల్పుల ఘటనలు నిత్యకృత్యంగా మారిపోయిన సంగతి తెలిసిందే
యునైటెడ్ స్టేట్స్ లో కాల్పుల ఘటనలు నిత్యకృత్యంగా మారిపోయిన సంగతి తెలిసిందే. అగ్రరాజ్యం అమెరికాలో నిత్యం ఏదో ఒక మూల తుపాకీ శబ్ధం విపిస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ కాల్పులలో భారతీయులు కూడా ఎక్కువగానే బలవుతున్నట్లు తెలుస్తుంది.
అమెరికాలో కాల్పుల శబ్ధం వస్తుంటే భారతదేశంలో వాటి తాలూకు ప్రతిస్పందనలు కనిపిస్తున్నాయి. గత కొంతకాలంగా దాదాపు వరుసగా అమెరికాలో ఉంటున్న భారతీయులు తుపాకీ కాల్పుల బారిన పడుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా మరో భారతీయ యువకుడు బలయ్యాడు.
అవును... అమెరికాలో జాక్సన్ కవిల్ అనే 18 ఏళ్ల భారతీయ యువకుడు కాల్చి చంపబడ్డాడు. హత్యానేరంలో భాగంగా నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాలిఫోర్నియాలోని గిల్ రాయ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడు కేరళ రాష్ట్రం కైప్పుజా కు చెందిన వారని తెలిసింది.
కాల్పుల ఘటన అనంతరం బాధితుడిని రాత్రి 9 గంటల ప్రాంతంలో సెయింట్ లూయిస్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. వైద్య సహాయం కోసం సిబ్బంది ప్రాణాలను రక్షించే చర్యలకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు అని స్థానిక మీడియా ప్రకటించింది.
కాగా, జాక్సన్ తండ్రి సన్నీ కవిల్ 1992లోనే కేరళ నుంచి అమెరికాకు వెళ్లి అక్కడే సెటిల్ అయ్యారు. గిల్ రాయ్ లో అతనికి ఓ చిన్న రెస్టారెంట్ ఉంది. అతని భార్య స్థానికంగా ఉండే ఓ ఆస్పత్రిలో నర్స్ గా పని చేస్తుంది. సన్నీ కవిల్ దంపతులకు నలుగురు పిల్లలు కాగా.. వారిలో జాక్సన్ అందరికంటే చిన్నవాడు.
ఈ సందర్భంగా జాక్సన్ బందువులూ, స్నేహితులూ సోషల్ మీడియా వేదికగా తనతో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటున్నారు. తీవ్రస్థాయిలో ఎమోషనల్ అవుతున్నారు. "జాక్సన్ కవి ఆకస్మిక మరణాన్ని పంచుకోవడానికి హృదయం ధ్రవించి పోతోంది. జాక్సన్ కన్నుమూశారు. అతను అందరి ముఖాల్లో చిరునవ్వులు పూయించడానికి ఇష్టపడే వ్యక్తి. జాక్సన్ నిజమైన, విశాల హృదయాన్ని కలిగి ఉన్నాడు" అని జాస్మిన్ కవిల్ అనే బంధువు ఫేస్ బుక్ పోస్ట్ లో రాశారు.