అమెరికాలో చావుబతుకుల మధ్య తెలుగు విద్యార్థిని.. కారణమిదే
అమెరికాలోని నార్త్ టెక్సాస్ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ చదువుతున్న తెలుగు విద్యార్థిని దీప్తి వంగవోలు రోడ్డు ప్రమాదంలో ( హిట్-అండ్-రన్ ఘటన)లో తీవ్రంగా గాయపడింది.;

అమెరికాలోని నార్త్ టెక్సాస్ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ చదువుతున్న తెలుగు విద్యార్థిని దీప్తి వంగవోలు రోడ్డు ప్రమాదంలో ( హిట్-అండ్-రన్ ఘటన)లో తీవ్రంగా గాయపడింది. ఏప్రిల్ 12న తెల్లవారుజామున డెంటన్‌లో ఆమెను ఢీకొట్టి వాహనంలోని డ్రైవర్ వేగంగా వెళ్లిపోయాడు. ఈ ప్రమాదానికి కారణమైన డ్రైవర్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. సోమవారం వెల్లడైన వివరాల ప్రకారం.. దీప్తి వంగవోలు మరో మహిళతో కలిసి నడుచుకుంటూ వెళ్తుండగా ఒక గుర్తు తెలియని వాహనం వారిని ఢీకొట్టింది. డ్రైవర్ వెంటనే ఆగకుండా అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు గాయపడ్డారు. రెండో మహిళకు స్వల్ప గాయాలు కాగా.., ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అయితే దీప్తి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆమె తలకు తీవ్రమైన గాయం తగలడంతో వెంటనే వైద్య సహాయం అందించాల్సి వచ్చింది. ఆమెతో ఉన్న మరో మహిళకు కూడా గాయాల కారణంగా శస్త్రచికిత్స చేయవలసి వచ్చిందని సమాచారం.
గుంటూరుకు చెందిన దీప్తి వంగవోలు నరసరావుపేట ఇంజనీరింగ్ కాలేజీలో 2023లో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ డిగ్రీ పూర్తి చేసి, ఉన్నత విద్య కోసం అమెరికా వచ్చారు. ఆమె నార్త్ టెక్సాస్ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో మాస్టర్స్ చేస్తున్నారు.
డెంటన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన శనివారం ఉదయం 2:12 గంటల ప్రాంతంలో కారిల్ అల్ లాగో డ్రైవ్‌లోని 2300 బ్లాక్‌లో జరిగింది. ప్రత్యక్ష సాక్షులు ఒక ముదురు రంగు సెడాన్‌ను గుర్తించారు, అది ఢీకొన్న వెంటనే నార్త్ బోనీ బ్రే స్ట్రీట్‌లో ఉత్తరం వైపు వెళ్లింది. పోలీసులు అనుమానిత వాహనాన్ని ముదురు రంగు కియా ఆప్టిమాగా నిర్ధారించారు. ప్రమాదం కారణంగా వాహనం ముందు గ్రిల్.. హెడ్‌లైట్ దెబ్బతిని ఉండవచ్చని వారు భావిస్తున్నారు. ఈ మేరకు స్థానిక రిపేర్ షాపులకు సమాచారం అందించారు.
ఈ హిట్-అండ్-రన్ గురించి లేదా ముదురు రంగు కియా ఆప్టిమా గురించి ఎవరికైనా సమాచారం తెలిస్తే డెంటన్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌ను సంప్రదించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషాదకరమైన సంఘటన టెక్సాస్‌లోని తెలుగు విద్యార్థి సమాజంలో తీవ్ర కలకలం రేపింది. దీప్తి త్వరగా కోలుకోవాలని అందరూ ప్రార్థిస్తున్నారు. బాధ్యులైన డ్రైవర్‌ను గుర్తించి శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. చిన్న సమాచారం కూడా కేసును ఛేదించడానికి సహాయపడుతుందని, ఎవరికైనా ఏమైనా తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరడమైనది. దీప్తికి న్యాయం జరగాలని సమాజం ఆశిస్తోంది.