కెనడా నూతన ప్రధానిగా అనిత.. జార్జ్.. ఎవరికి అవకాశం ఎంత?
దీంతో... తదుపరి ప్రధాని ఎవరనే విషయం ఆసక్తిగా మారిన వేళ.. ఇద్దరు భారత సంతతి నేతల పేర్లు తెరపైకి వచ్చాయి.
కెనడా రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ప్రస్తుత ప్రధాని జస్టిన్ ట్రూడో అటు ప్రధానమంత్రి పదవితో పాటు, ఇటు లిబరల్ పార్టీ నాయకత్వ బాధ్యతలనుంచి వైదొలగనున్నట్లు తెలిపారు. దీంతో... తదుపరి ప్రధాని ఎవరనే విషయం ఆసక్తిగా మారిన వేళ.. ఇద్దరు భారత సంతతి నేతల పేర్లు తెరపైకి వచ్చాయి.
అవును.. కెనడా రాజకీయాల్లో అత్యంత కీలక పరిణామం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... కొత్త నాయకుడిని ఎన్నుకున్న అనంతరం తాను పార్టీ అధ్యక్ష పదవితో పాటు, కెనడా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు జస్టిన్ ట్రూడో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో... నెక్స్ట్ ఎవరు అనే చర్చ తెరపైకి వచ్చింది.
ఈ సమయంలో... తదుపరి కెనడా ప్రధాని రేసులు లిబరల్ పార్టీకి చెందిన పలువురు నేతల పేర్లు ప్రధానంగా వినిపించాయి. ఇందులో భాగంగా... ఆర్థిక మంత్రి డొమినిక్ లెబ్లాంక్ తదుపరి ప్రధానిగా ఎన్నికయ్యే అవకాశం ఉందని కథనాలొచ్చాయి. ఆయనతోపాటూ క్రిస్టినా ఫ్రీలాండ్, మెలనీ జోలీ, మార్క్ కార్నీ, క్రిస్టీ క్లార్క్ ల పేర్లు వినిపించాయి.
వీరితో పాటు ప్రముఖంగా భారత సంతతికి చెందిన ఇద్దరూ ఎంపీలూ జార్జ్ చాహల్, అనిత ఆనంద్ ల పేర్లు తెరపైకి వచ్చాయి. దీంతో... వీరు ఎవరు, భారత్ తో వీరికున్న సంబంధం ఏమిటి.. వీరిలో ఎవరైనా కెనడా ప్రధానిగా మారితే భారత్ తో ఆ దేశ సంబంధాలు ఏ మేరకు మెరుగవుతాయి అనే చర్చలు మొదలయ్యాయి.
కారణం... గత కొంతకాలంగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అనుసరించిన వ్యవహార శైలిపై భారత్ సీరియస్ గా స్పందించిన సంగతి తెలిసిందే. ట్రూడో వైఖరితో గతంలో ఎన్నడూ లేని స్థాయిలో భారత్ - కెనడా దౌత్య సంబంధాలు పతనావస్థకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో... కెనడా కొత్త ప్రధాని ఎంపికపై భారత్ లోనూ ఆసక్తి నెలకోంది.
ఎవరీ అనితా ఆనంద్?:
2019లో ఓక్ విల్లే నుంచి ఎంపీగా ఎన్నికైన 57 ఏళ్ల అనితా ఆనంద్.. తండ్రి తమిళనాడుకు చెందిన డాక్టర్ కాగా.. తల్లి పంజాబీ మూలాలున్న మహిళ. అనితా ఆనంద్ ఎంపీగా ఎన్నికైన వెంటనే ట్రూడో క్యాబినెట్ లో చోటు దక్కించుకున్నారు. ఇందులో భాగంగా... 2019 నుంచి సుమారు మూడేళ్ల పాటు ప్రజాసేవల మంత్రిగా పని చేశారు.
అనంతరం దాదాపు రెండేళ్ల పాటు రక్షణమంత్రిగానూ వ్యవహరించారు. ఈ క్రమలో గత నెలలలో జరిగిన మంత్రివర్గ పునర్వవస్థీకరణలో భాగంగా ఈమె రవాణా, అంతర్గత వాణిజ్య వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు అందుకున్నారు. ఈమె ఇప్పుడు ప్రధాని రేసులో ఉన్నట్లు చెబుతున్నారు.
జార్జ్ చాహల్ కు ఛాన్స్ ఎంత?:
కెనడా కొత్త ప్రధానికి సంబంధించిన లిబరల్ పార్టీ నేతల రేసులో భారత సంతతికి చెందిన మరో వ్యక్తి గా జార్చ్ చాహల్ ఉన్నారు. ప్రస్తుతం హౌస్ ఆఫ్ కామన్స్ సభ్యుడిగా ఉన్న ఆయన.. స్టాండింగ్ కమిటీకి నేతృత్వం వహించారు. ఇదే సమయంలో.. సిక్కుల కాకస్ కు అధ్యక్షుడిగానూ పనిచేశారు.
ఈ క్రమంలో... చాహల్ ను లిబరల్ పార్టీ లెజిస్లేటివ్ కాకస్ తాత్కాలిక నేతగా నియమించింది. ఈ నేపథ్యంలో.. ఆ కారణంతో ఆయన పార్టీ నాయకుడిగా గెలిచినా ప్రధాని పదవి మాత్రం చేపట్టేందుకు అర్హుడు కాదని అంటున్నారు. కారణం... కెనడా చట్టాల ప్రకారం.. తాత్కాలిక నేతలు ప్రధాని పదవి చేపట్టేందుకు వీలులేకపోవడమే!