కెనడాలో మరో దారుణం.. ఈసారి తెలుగు విద్యార్థి!

కెనడాలో విషాదం చోటు చేసుకుంది. ఉన్నత విద్య, ఆ తర్వాత మంచి ఉద్యోగం ఆశతో కెనడాకు వెళ్లిన తెలుగు యువకుడు ప్రమాదంలో మృత్యువాతపడ్డాడు.

Update: 2024-09-16 11:12 GMT

కెనడాలో విషాదం చోటు చేసుకుంది. ఉన్నత విద్య, ఆ తర్వాత మంచి ఉద్యోగం ఆశతో కెనడాకు వెళ్లిన తెలుగు యువకుడు ప్రమాదంలో మృత్యువాతపడ్డాడు. దీంతో అతడి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు తల్లడిల్లుతున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌ లోని మీర్‌ పేటకు చెందిన ప్రణీత్‌ ఎంఎస్‌ చదవడానికి కెనడాకు వెళ్లాడు. సెప్టెంబర్‌ 15న తన పుట్టిన రోజు కావడంతో తన అన్న, స్నేహితులతో కలిసి ఔటింగ్‌ కు వెళ్లాడు. ఈ క్రమంలో అక్కడ ఒక లేక్‌ లో చాలా సేపు బోటులో గడిపారు. ఆ తర్వాత ఈత కొట్టడానికి దిగిన సరస్సులో దిగిన ప్రణీత్‌ ప్రమాదవశాత్తూ అందులో మునిగి మృత్యువాత పడ్డాడు. స్నేహితులు అతడిని కాపాడటానికి ప్రయత్నించినా ఫలితం దక్కలేదు.

ఇలా ఉన్నత విద, ఉద్యోగం ఆశలతో విదేశాలకు వెళ్లిన ప్రణీత్‌ ను సరస్సు మింగేసింది. దీంతో అతడి స్నేహితులు పోలీసులకు సమాచారమిచ్చారు. కెనడా పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ప్రణీత్‌ ను బయటకు తీశారు. అప్పటికే అతడు మృత్యువాత పడ్డాడు. దీంతో పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ప్రణీత్‌ సోదరుడు, స్నేహితులను ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనకు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

హైదరాబాద్‌ లోని మీర్‌ పేటకు చెందిన రవి, సునీతలకు ప్రణీత్‌ రెండో కుమారుడు అని తెలుస్తోంది. ప్రణీత్‌ అన్న కూడా ఉన్నత చదువుల కోసం కెనడాలోనే ఉన్నాడు. ఆ దేశంలోని టోరంటో నగరంలో ఉంటున్న అన్నదమ్ములు తమ స్నేహితులతో కలిసి అక్కడ ఉన్న లేక్‌ కు వెళ్లారు.

ప్రణీత్‌ పుట్టిన రోజు కావడంతో అంతా కలిసి పార్టీ చేసుకున్నారు. సరదాగా గడిపారు. అప్పటిదాకా కేరింతలు, తుళ్లింతలతో గడిపిన ప్రణీత్‌ ఈత కోసమంటూ సరస్సులో దిగాడు. మధ్య వరకు ఈదుకుంటూ వెళ్లి మునిగిపోయాడు. బోటులో ఉన్న అతడి అన్న, మిగతా స్నేహితులు రక్షించడానికి ప్రయత్నించినా అప్పటికే నీట మునిగి ప్రణీత్‌ మరణించాడు. పుట్టిన రోజు నాడే తన కుమారుడు మృతి చెందడంతో ప్రణీత్‌ తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. అతడి మృతదేహాన్ని తీసుకురావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయం చేయాలని కన్నీటితో విన్నవిస్తున్నారు.

Tags:    

Similar News