హైదరాబాద్ లో ఇల్లు అద్దెకు ఇచ్చిన ఎన్నారైలకు బిగ్ అలర్ట్!!

హైదరాబాద్ లో స్థలం ఆరు నెలలు ఖాళీగా ఉంటే అపార్ట్ మెంట్స్ కట్టి అమ్మేస్తారు

Update: 2024-07-09 04:55 GMT

హైదరాబాద్ లో స్థలం ఆరు నెలలు ఖాళీగా ఉంటే అపార్ట్ మెంట్స్ కట్టి అమ్మేస్తారు.. హైదరాబాద్ లో సింగిల్ రిజిస్ట్రేషన్ ఉన్న భూములు గుర్తించడం కష్టం వంటి కామెంట్లు అటు సినిమాల్లోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ వినిపిస్తుంటాయనేది తెలిసిన విషయమే! అయితే తాజాగా ఒక ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది.. హైదరాబాద్ లో ఇల్లు అద్దెకు ఇచ్చిన ఎన్నారైల కష్టాలకు సంబంధించింది ఆ విషయం!

అవును... తాజాగా సోషల్ మీడియాలో ఒక ప్రచారం హల్ చల్ చేస్తుంది. హైదరాబాద్ లోని హై లెవెల్ గేటేడ్ కమ్యునిటీలో ఆస్తులు ఉన్న ఎన్నారైలకు సంబంధించింది ఆ విషయం. ఇంతకూ ఏమిటీ ఆ విషయం.. తాజాగా ఎన్నారైకి ఎదురైన సమస్య ఏమిటి.. అటువంటి సమస్యలు ఎదురవ్వకుండా తీసుకొవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అనేవి ఇప్పుడు చూద్దాం...!

తాజాగా సోషల్ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం... ఇటీవల హైదరాబాద్ లోని వెస్ట్ ఏరియాలోని ఓ హై లెవెల్ గేటెడ్ కమ్యునిటీలో ఓ ఉన్న తన విల్లాను కొన్నేళ్ల క్రితం అద్దెకు ఇచ్చారు ఓ ఎన్నారై. ఇప్పుడు ఆయనకు అదే పెద్ద సమస్య అయ్యింది! ఈ క్రమంలో ఆయన ఇండియాకు తిరిగి రావాలని భావించారు. దీంతో.. అద్దెకు ఉంటున్నవారికి ఫోన్ చేసి ఖాళీ చేయాలని కోరారు. అక్కడే స్టార్ట్ అయ్యింది అసలు కథ!

ఇలా ఇంటి యజమాని ఫోన్ చేసి ఖాళీ చేయమని అడిగితే... అద్దెకు ఉంటున్న వ్యక్తి అందుకు నిరాకరించాడు. ఇదే సమయంలో... కోర్టుకు వెళ్లాడు. ఈ సమయంలో ఉన్నఫలంగా ఖాళీ చేయడం వల్ల అది తన కుమార్తె చదువుపై ప్రభావం పడుతుందని చెబుతూ స్టే ఆర్డర్ తెచ్చుకున్నాడు. పైగా అతడికి కమ్యునిటీ పాలకవర్గం, లోకల్ పోలీసులతో సంబంధాలు ఉండటంతో.. అతడిని ఖాళీ చేయించడం ఎన్నారైకి కష్టమవుతుందట.

దీంతో చేసేది లేక... అదే కమ్యునిటీలో మరో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారంట సదరు ఎన్నారై. ఫలితంగా... ప్రతి నెలా లక్షకు పైగా అద్దె చెల్లిస్తున్నాడట. ఇలా సొంత విల్లా ఉన్నాప్పటికీ.. అద్దె చెల్లిస్తూ మరో ఇంట్లో అద్దెకు ఉండాల్సిన పరిస్థితి ఎదురైందని వాపోతున్నారని అంటున్నారు. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే... ఇదే సూత్రాన్ని ఫాలో అయ్యి మరో ఇద్దరు అద్దెదారులు సక్సెస్ అయ్యారని అంటున్నారు!

ఈ నేపథ్యంలో... హైదరాబాద్ లో ఆస్తులు ఉండి.. వాటిని అద్దెకు ఇచ్చే ఆలోచనలో ఉన్న ఎన్నారైలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు పరిశీలకులు! స్థానికంగా బాగా పెద్ద పేరున్న వ్యక్తులకు కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కానీ అద్దెకు ఇవ్వడం మానుకోవాలని సూచిస్తున్నారు. ఉద్యోగస్తులకు ఇవ్వడం బెటరని.. ఇల్లు అద్దెకు ఇచ్చే ముందు లాయర్ ని సంప్రదించడం అతిముఖ్యమని అంటున్నారు.

Tags:    

Similar News