భారతీయ వ్యక్తి విషాదాంతం.. చేయని నేరానికి!

చేయని నేరానికి 85 ఏళ్ల భారతీయుడు 38 ఏళ్లు జైలు జీవితం గడిపి జైలులోనే మరణించాడు

Update: 2024-08-09 11:30 GMT

చేయని నేరానికి 85 ఏళ్ల భారతీయుడు 38 ఏళ్లు జైలు జీవితం గడిపి జైలులోనే మరణించాడు. ఈ విషాదం బ్రిటన్‌ లో చోటు చేసుకుంది. డెరిక్, డువాన్‌ మూ యంగ్‌ అనే వ్యక్తులను హత్య చేశాడని ఆరోపణలు ఎదుర్కొని క్రిస్‌ మహారాజ్‌ అనే భారతీయ వ్యక్తి 1986లో దోషిగా నిర్ధారించబడ్డాడు. దీంతో అతడికి మరణశిక్ష పడింది. దీన్ని కోర్టు 2002లో జీవిత ఖైదుగా మార్చింది.

1986 నుంచి జైలులోనే మగ్గిన క్రిస్‌ మహారాజ్‌ అందులోనే తన జీవితాన్ని చాలించాడు. వాస్తవానికి 2019లోనే అతను నిర్దోషి అని కోర్టు ప్రకటించింది. అయితే అతడి విడుదలకు ఆ సాక్ష్యం సరిపోదని కోర్టు అభిప్రాయపడింది. దీంతో అతడు ఇన్నేళ్ల నుంచి జైలులోనే మగ్గుతున్నాడు.

ట్రినిడాడ్‌ లో స్థిరపడ్డ క్రిస్‌ మహరాజ్‌ ఇంగ్లండ్‌ లో నివసిస్తున్నారు. ఒక ఇంటిని కొనుగోలు చేసేందుకు ఫ్లోరిడాకు వెళ్లినప్పుడు అతడిని అరెస్టు చేశారు. ఒకప్పుడు పందెం గుర్రాలు, రోల్స్‌ రాయిస్‌ లతో అతడు సంపన్నుడైన వ్యాపారవేత్తగా ఉండేవాడు. అయితే ఇద్దరు వ్యక్తుల హత్యతో అభియోగాలు ఎదుర్కొని జైలుపాలయ్యాడు.

తన భర్త అమాయకుడని అతడి భార్య మారితా నమ్మినప్పటికీ కోర్టు విశ్వసించలేదు. మరణశిక్షను యావజ్జీవ శిక్షగా మాత్రమే మార్చింది. దీంతో జైలుకు వెళ్లడానికి ముందు ఎంతో వైభవంగా జీవించిన అతడు చివరకు జైలులో అనామకుడిలా కన్నుమూశాడు.

తన భర్త మరణంలో మారితా మహారాజ్‌ గుండెలు బాదుకుంది. అతని మృతదేహాన్ని అంత్యక్రియల కోసం ఇంగ్లండ్‌ కు తీసుకురావాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఆమె 1976లో తన భర్తకు వాగ్దానం చేసింది. ఆ వాగ్దానాన్ని ఇప్పుడు నెరవేర్చింది. అలాగే ఆ హత్యలతో తన భర్తకు ఏ సంబంధం లేదని నిరూపించడానికి కూడా పోరాటం చేయాలని నిర్ణయించింది.

ఒక నిరపరాధినిపై అభాండాలు మోపి అతడికి జీవిత ఖైదు విధించి అతడు జైలులోనే ప్రాణాలు విడిచేలా చేసిన ఉదంతం బ్రిటిష్‌ రాజకీయ నేతలను, మానవ హక్కుల సంఘాలను, న్యాయవాదులను సైతం కదిలించింది. అయితే వీరి మద్దతు క్రిస్‌ మహారాజ్‌ మరణశిక్షణను రద్దు చేయడానికి మాత్రమే ఉపయోగపడింది. అతడు నిర్దోషి అని నిరూపించుకున్నప్పటికీ జీవితాంతం జైలులోనే ఉండి మరణించాల్సి వచ్చింది.

Tags:    

Similar News