మైక్రోసాఫ్ట్‌ కీలక నిర్ణయం.. భారతీయ అమెరికన్‌ మహిళకు పగ్గాలు!

ప్రముఖ విద్యా సంస్థ ఐఐటీ మద్రాస్‌ లో ఇంజనీరింగ్‌ చదివిన అపర్ణకు ప్రొడక్ట్‌ డెవలప్మెంట్, డిజైన్, స్ట్రాటజీ విభాగాల్లో 20 ఏళ్లకు పైగా అనుభవముంది.

Update: 2023-10-12 16:02 GMT

గూగుల్‌ తో పోటీ పడే దిశగా మరో టెక్‌ దిగ్గజం.. మైక్రోసాఫ్ట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. మైక్రోసాఫ్ట్‌ కార్పొరేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా భారతీయ అమెరికన్‌ మహిళ.. అపర్ణ చెన్నప్రగడను నియమించింది. టెక్‌ పరిశ్రమలో ఆమెకు విశేష అనుభవముంది. ఈ నేపథ్యంలో ఆమెకు కీలకమైన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజన్స్‌ విభాగం బాధ్యతలు అప్పగించారు.

ప్రముఖ విద్యా సంస్థ ఐఐటీ మద్రాస్‌ లో ఇంజనీరింగ్‌ చదివిన అపర్ణకు ప్రొడక్ట్‌ డెవలప్మెంట్, డిజైన్, స్ట్రాటజీ విభాగాల్లో 20 ఏళ్లకు పైగా అనుభవముంది. గతంలో ఆమె గూగుల్‌ లో ఆమె సుమారు 12 ఏళ్లు విధులు నిర్వర్తించారు.

తాజాగా మైక్రోసాఫ్ట్‌ లో కార్పొరేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా చేరిన ఆమె మైక్రోసాఫ్ట్‌ 365, మైక్రోసాఫ్ట్‌ డిజైనర్‌ లో జెనరేటివ్‌ ఏఐ ప్రయత్నాలకు నాయకత్వం వహిస్తారని చెబుతున్నారు.

అపర్ణ చెన్నప్రగడ లింక్డ్‌ ఇన్‌ ప్రొఫైల్‌ ప్రకారం.. ఆమె ఐఐటీ మద్రాస్‌ నుంచి కంప్యూటర్‌ సైన్స్‌లో బీటెక్‌ చదివారు. అమెరికాలో టెక్సాస్‌ విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్‌ సైన్స్‌ లో డబుల్‌ మాస్టర్స్‌ డిగ్రీ చేశారు. ప్రఖ్యాత విశ్వవిద్యాలయం.. మిట్‌ నుంచి మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ లో డబుల్‌ మాస్టర్స్‌ డిగ్రీ చదివారు.

ప్రముఖ ఆన్‌లైన్‌ వ్యాపార ఉత్పత్తుల సంస్థ.. ఈబేలో కన్సూ్యమర్‌ షాపింగ్‌ కు వైస్‌ ప్రెసిడెంట్‌ గా కూడా అపర్ణ పనిచేశారు. ఏఆర్, విజువల్‌ సెర్చ్‌ ప్రొడక్టులకు లీడ్‌ గా, బోర్డు మెంబర్‌ గా కూడా అపర్ణ విధులు నిర్వర్తించారు.

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ లో గూగుల్, మైక్రోసాఫ్ట్‌ మధ్య తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో మైక్రోసాఫ్ట్‌ అపర్ణకు కీలక బాధ్యతలు అప్పగించడం ప్రాధాన్యత సంతరించుకుంది. యూఎస్‌ చెందిన బిజినెస్‌ పబ్లికేషన్‌ .. 'ఇన్ఫర్మేషన్‌' ఈ విషయాన్ని వెల్లడించింది.

అపర్ణ నియామకానికి ముందు మరో భారతీయ–అమెరికన్‌ రోహిణి శ్రీవత్స సెప్టెంబర్‌లో మైక్రోసాఫ్ట్‌ ఇండియా, దక్షిణాసియాలో చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ గా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అలాగే పునీత్‌ చందోక్‌ ఆగస్టులో భారతదేశం, దక్షిణాసియాకు మైక్రోసాఫ్ట్‌ కార్పొరేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు.

కాగా గూగుల్‌ సీఈవోగా భారతీయ అమెరికన్‌ సుందర్‌ పిచాయ్, మైక్రోసాఫ్ట్‌ సీఈవోగా మరో భారతీయ అమెరికన్‌ సత్య నాదెళ్ల కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News