హెచ్ 1 బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు యూఎస్ గుడ్ న్యూస్!
దీంతో.. ఇప్పటివరకు 180 రోజులు ఉన్న పరిమితి కాస్తా 540 రోజులకు పెరిగింది.
హెచ్ 1బీ వీసాదారుల భాగస్వామ్యులకు అగ్రరాజ్యం అమెరికా తీపి కబురును ప్రకటించింది. తాజా ప్రకటన నేపథ్యంలో ఇప్పటివరకున్న వీసా కష్టాలు చాలా వరకు తగ్గనున్నాయి. తాజాగా యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ హోం ల్యాండ్ సెక్యూరిటీ గురువారం హెచ్ 1బీ, ఎల్ 1 వీసాదారుల భాగస్వాములకు ఆటోమేటిక్ వర్క్ పర్మిట్ రెన్యూవల్ కాల పరిమితిని పొడిగిస్తున్నట్లుగా ప్రకటించింది.
దీంతో.. ఇప్పటివరకు 180 రోజులు ఉన్న పరిమితి కాస్తా 540 రోజులకు పెరిగింది. ఈ కొత్త నిబంధన వచ్చే నెల (జనవరి) 13 నుంచి అమల్లోకి రానుంది. అయితే.. దీనికి ఒక కీలక కండీషన్ ఉంది. 2022, మే4న లేదా ఆ తర్వాత దరఖాస్తు చేసుకున్న వారికే ఈ సౌకర్యం వర్తిస్తుంది. హెచ్1బీ వీసాదారులకు ఉండే సమస్య ఏమంటే.. వీసా జారీ ప్రక్రియలో ఆలస్యం కారణంగా పని చేసే అవకాశాన్ని కోల్పోతారు.
ఈ కారణంగా వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతారు. ఈ నేపథ్యంలో అలాంటి సమస్యలకు పరిష్కారంగా గడువును పొడిగించటం ద్వారా వీసా రెన్యువల్ కష్టాలు కొద్దిమేర తగ్గుతాయని చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. ఈ నెల మొదటి వారంలో హెచ్ 1బీ వీసాదారులకు భారీ ఊరట లభించిన సంగతి తెలిసిందే. వీసాదారుల భాగస్వాముల ఉద్యోగ అనుమతికి సంబంధించి కింది కోర్టు ఇచ్చిన అనుకూల తీర్పును సమీక్షించమని అమెరికా సుప్రీంకోర్టు నిర్ణయం తెలిసిందే.
ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం హెచ్ 1బీ వీసాదారులకు వీసా కాలపరిమితిని ఆరేళ్లకు మించి పొడిగించినా.. లేదంటే వారికి గ్రీన్ కార్డు వచ్చే అవకాశం ఉన్న సందర్భాల్లో వారి జీవితభాగస్వాములు ఉద్యోగ అనుమతి పొందేందుకు అర్హులు. 2015లో ఒబామా ప్రభుత్వం ఈ రూల్ ను తీసుకొచ్చింది. గ్రీన్ కార్డుల జారీలో దశాబ్దాల తరబడి జాప్యం జరుగుతుండటంతో భారతీయులకు లాభించే ఈ నిర్ణయాన్ని అప్పట్లో తీసుకున్నారు. అయితే.. ఈ నిబంధన అమలుకు కాంగ్రెస్ అనుమతి కావాలన్నారు. అయితే.. కోర్టు మాత్రం ఎన్నారైలకు అనుకూలంగా తీర్పును ఇవ్వటంతో ఈ తీర్పును పున:సమీక్షించేందుకు తాజాగా సుప్రీం సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో.. ప్రవాసభారతీయులకు భారీ ఊరట లభించింది. తాజాగా.. మరో గుడ్ న్యూస్ రావటం ఆసక్తికరంగా మారింది.