మరో భారతీయుడికి ట్రంప్ పెద్ద పీట.. ఆ కొత్త సలహాదారు ఎవరు?
తొలిసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన సమయంలో కంటే.. రెండోసారి అధ్యక్షుడు కాబోతున్న సమయంలో డొనాల్డ్ ట్రంప్ భారతీయులకు పెద్ద పీట వేస్తున్నారు.
తొలిసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన సమయంలో కంటే.. రెండోసారి అధ్యక్షుడు కాబోతున్న సమయంలో డొనాల్డ్ ట్రంప్ భారతీయులకు పెద్ద పీట వేస్తున్నారు. ఒకరి వెంట ఒకరిని కీలక బాధ్యతల్లో నియమిస్తున్నారు. ఇప్పటికే వివేక్ రామస్వామికి అమెరికా ప్రభుత్వంలో ప్రక్షాళన బాధ్యతలు అప్పగించారు. అది కూడా ఎలాన్ మస్క్ వంటి అపర కుబేరుడితో కలిపి.. ఇప్పుడు మరో ప్రవాస భారతీయుడికి అగ్రతాంబూలం వేయనున్నారు.
శ్రీ రామ్ కృష్ణన్.. భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త, వెంచర్ క్యాపిటలిస్ట్. ఇప్పుడు ఆయనను ట్రంప్ ఏరికోరి మరీ భవిష్యత్ టెక్నాలజీ అయిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పై వైట్ హౌస్
పాలసీ సీనియర్ సలహాదారు పదవిని భారతీయుడికి కట్టబెట్టారు.
ప్రభుత్వంలో పాత్ర..
వివేక్ రామస్వామిని ప్రభుత్వ వ్యవస్థ ప్రక్షాళనకు నియమించగా.. శ్రీరామ్ ను ప్రభుత్వ కార్యకలాపాల్లో ఏఐ వినియోగం, విధానాల సమన్వయం బాధ్యతలు అప్పగించారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రెసిడెంట్ కౌన్సిల్ ఆఫ్ అడ్వైజర్స్ తో ఈయన పని చేయనున్నారు. ఇందులోని మరో సభ్యుడు అమెరికాలో ప్రముఖ చెల్లింపుల సంస్థ పే-పాల్ మాజీ సీఈవో డేవిడ్ ఓ సాక్స్ కావడం గమనార్హం.
ఈయనే ఎందుకు..?
ఇటీవలి కాలంలో బాగా ఆదరణ పొందిన చాటో బోట్ చాట్ జీపీటీ. దీనికి మదర్ కంపెనీ ఓపెన్ ఏఐ. ఈ సంస్థతో పాటు పలు దిగ్గజ సంస్థలు, ఏఐ ఆధారిత మోడళ్ల మధ్య సవాళ్ల పరిష్కారానికి సాంకేతికతను ఉపయోగించుకోవడంలో శ్రీరామ్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
వెంచర్ క్యాపిటల్ సంస్థ ఆండ్రస్సెన్ హోరోవిట్జ్ లో 2021లో జనరల్ పార్ట్ నర్ గా చేరి.. 2023లో లండన్ శాఖ అధిపతి అయ్యారు. నిరుడు నవంబరులో బయటకు వచ్చేశారు. 2021లో ‘ఆరతి అండ్ శ్రీరామ్ షో (ది గుడ్ టైమ్ షో)’తోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దీనిని భార్య ఆరతితో కలిసి శ్రీరామ్ హోస్ట్ చేస్తుండడం గమనార్హం.
చెన్నైలో పుట్టి..
శ్రీరామ్ కృష్ణన్.. పేరు వినగానే చెప్పేయొచ్చు. తమిళుడు అని.
చెన్నైలో పుట్టారు. కాంచీపురంలో ఇంజినీరింగ్ చదివి 2005లో అమెరికా వెళ్లారు. శ్రీరామ్ తండ్రి ఇన్సూరెన్స్ కంపెనీ ఉద్యోగి. తల్లి గృహిణి. ఇక శ్రీరామ్ ఉద్యోగ జీవితం మైక్రోసాఫ్ట్ లో మొదలైంది. ఆపై ట్విటర్, యాహూ, ఫేస్ బుక్, స్నాప్ డీల్ లో పనిచేశారు. ఫేస్ బుక్, స్పాప్ లో మొబైల్ యాప్ డెవలప్ మెంట్ కోసం పనిచేశారు.
కృష్ణన్ కు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తో ఉద్యోగపరంగా సంబంధం ఉంది. అదెలాగంటే.. ట్విటర్ ను 2022లో మస్క్ కొన్నాక దాని పునరుద్దరణ కోసం మస్క్ తో కలిసి పనిచేశారు.