ఇరాన్ మిస్సైల్ దాడుల్ని స్వయంగా చూసిన తెలుగు వ్యక్తి ఏం చెప్పాడంటే?
ఇజ్రాయెల్ లో వేలాదిగా భారతీయులు ఉండటం తెలిసిందే. అందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారి సంఖ్య తక్కువేం కాదు.
ఇజ్రాయెల్ లో వేలాదిగా భారతీయులు ఉండటం తెలిసిందే. అందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారి సంఖ్య తక్కువేం కాదు. ఇజ్రాయెల్ పై పెద్ద ఎత్తున మిస్సైల్ దాడికి పాల్పడిన ఇరాన్ కారణంగా ఆ దేశంలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ ప్రయోగించిన క్షిపణి వ్యవస్థను సమర్థంగా తాము ఎదుర్కొంటున్నట్లు ఇజ్రాయెల్ చెబుతోంది. అయితే.. అందులో నిజం ఎంత? అన్నప్పుడు సమాధానం కష్టమే.
కానీ.. మన తెలుగు వ్యక్తి ఒకరు అక్కడే ఉండి.. అక్కడ జరుగుతున్న పరిణామాల మీద కళ్లకు కట్టినట్లుగా చెబుతున్న వైనం చూస్తే.. వెన్నులో చలి పుట్టటం ఖాయం. ఇరాన్ మిస్సైల్ దాడిపై ఒక తెలుగు వ్యక్తి స్వీయ అనుభవాన్ని చదవటానికి ముందు ఆ వ్యక్తి గురించి? ఇజ్రాయెల్ లో ఎంత కాలంగా ఉన్నారు? అక్కడేం చేస్తున్నారన్న విషయాల్లోకి వెళితే..
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ పట్టణానికి చెందిన కుకునూరు కిశోర్ పదేళ్ల క్రితం ఇజ్రాయెల్ కు వెళ్లారు. అక్కడ టెల్ అవీవ్ లో ఐటీ ఉద్యోగిగా పని చేస్తున్నారు. ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఆయన తన స్వీయ అనుభవాన్ని వెల్లడించారు. తన కళ్లతో తాను ఇరాన్ జరిపిన మిస్సైల్ దాడిని చూసినట్లు చెప్పారు. తాను ఉన్న ‘టెల్ అవీవ్’ నుంచి క్షిపణి దాదుల్ని తాను చూసినట్లుగా పేర్కొన్నారు.
ఇరాన్ మిస్సైల్ దాడుల ప్రభావం తీవ్రంగా ఉందని.. హిజ్జుబ్లా రాకెట్ దాడులను తాను చాలానే చూసినట్లు పేర్కొన్నారు. అయితే.. వాటిని తాము పెద్దగా పట్టించుకోలేదన్నారు. కానీ.. మంగళవారంరాత్రి ఇరాన్ చేసిన మిస్సైల్ దాడులతో మాత్రం తమకు తొలిసారి భయం కలిగినట్లుగా వెల్లడించారు. ‘‘ఇరాన్ చేసిన దాడులతో మొదటిసారి భయం కలిగింది. మంగళవారం రాత్రి ఏడున్నర గంటల ప్రాంతంలో దక్షిణం వైపు నుంచి మిస్సైల్ దాడులు జరుగుతాయని సురక్షిత ప్రాంతాలకువెళ్లాలని నా ఫోన్ కు మెసేజ్ వచ్చింది. సరిగ్గా 7.40 గంటలకు ఆకాశంలో మిస్సైల్స్ వేగంగా రావటం చూశాను. చాలా క్షిపణుల్ని ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ అడ్డుకోలేకపోయింది’’ అని పేర్కొన్నారు.
తాను ఉండే ప్రాంతంలోని ఒక షాపింగ్ కాంప్లెక్స్ పైన ఐరన్ డోమ్ అడ్డుకున్న మిస్సైల్ పడినట్లుగా కిశోర్ చెప్పారు. ‘అక్టెబరు 5 వరకు ప్రజలు అత్యవసరమైతే తప్పించి బయటకు రావొద్దని ఇజ్రాయెల్ రక్షణ వర్గాల నుంచి సూచనలు అందాయి. ఇండియన్ ఎంబసీ నుంచి కూడా దాడులు జరుతాయన్న మెసేజ్ లు వస్తున్నాయి. మిస్సైల్స్ ఉత్తరం నుంచి వస్తే అవి హిజ్బుల్లా అని.. అదే దక్షిణం వైపు నుంచి మిస్సైల్స్ దూసుకు వస్తే అవి ఇరాన్ నుంచి వచ్చినట్లుగా అర్థమవుతుంది. రాకెట్స్.. మిస్సైల్స్ వచ్చే ముందు ఫోన్లకు అలెర్టులు వస్తాయి. కొంత టైమిస్తారు. కానీ.. మంగళవారం రాత్రిమాత్రం కేవలం 2 నిమిషాల ముందే వార్నింగ్ ఇచ్చారు. వారు పంపే మెసేజ్ లోనూ ఎంతసేపు దాడులుజరుగుతాయి. ఎప్పుడు బయటకు రావొచ్చు? అంతాసేఫ్ గా ఉందా? లేదా? కూడా మెసేజ్ లోనూ చెబుతారు. మంగళవారం రాత్రి నేనున్న అపార్టుమెంట్ పై నుంచి ఇరాన్ క్షిపణి వరుస పెట్టి దూసుకెళ్లాయి. ఇదంతా చూసినప్పుడు భయాందోళనలకు గురయ్యాను’’ అంటూ అక్కడి పరిస్థితిని ఉన్నది ఉన్నట్లుగా.. తానేం ఫీల్ అయ్యానో ఆ విషయాన్ని కిశోర్ చెప్పారు.