దుకాణంలో ఉండగా కాల్చేశాడు.. అమెరికాలో తెలుగు యువకుడి విషాదాంతం
కర్లపాలెం మండలం యాజలి గ్రామానికి చెందిన గోపీ ఎనిమిది నెలల కిందట అమెరికా వెళ్లాడు.
ఎన్నిసార్లు చెప్పుకొన్నా.. ఎంతమంది ప్రాణాలు పోయినా.. అమెరికాలో గన్ కల్చర్ ఆగడం లేదు.. తరచూ భారతీయులు బలవుతున్నారు.. అలాంటిదో మరో ఘటన చోటుచేసుకుంది.. భార్యాబిడ్డలను వదిలి.. జీవనోపాధి కోసం దేశం కాని దేశం వెళ్లి దుకాణంలో ఉద్యోగం చేసుకుంటున్న తెలుగు యువకుడిని ఓ దుండగుడు కాల్చి చంపాడు. దుకాణంలో కొనేందుకు వచ్చాడని భావిస్తే.. తుపాకీ తీసి కాల్చ చంపేశాడు.
అంతా సెకన్లలోనే..
అమెరికా టెక్సస్ రాష్ట్రంలోని డాలస్ నగరంలోని సూపర్ మార్కెట్ లో షాప్ కీపర్ గా పనిచేస్తున్న ఏపీలోని బాపట్ల జిల్లాకు చెందిన దాసరి గోపీ కృష్ణ (32) దుండగుడి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు.
కర్లపాలెం మండలం యాజలి గ్రామానికి చెందిన గోపీ ఎనిమిది నెలల కిందట అమెరికా వెళ్లాడు. తెలుగువారు ఎక్కువగా ఉండే డాలస్ లోని సూపర్ మార్కెట్ లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. అయితే, అమెరికా కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం గోపీ షాప్ కౌంటర్ లో ఉండగా ఓ దుండగుడు లోపలకు వచ్చాడు. అలా వస్తూ వస్తూనే తుపాకీతో గోపీపై కాల్పులు జరిపాడు.
దోచుకున్నదీ పెద్దగా లేదు?
సీసీ కెమెరాల్లో రికార్డయిన దాని ప్రకారం.. ఒకటికి రెండుసార్లు దుండగుడి కాల్పులతో గోపీ కుప్పకూలాడు. దుండగుడు వెంటనే సూపర్ మార్కెట్ కౌంటర్ లోకి చొరబడ్డాడు. అయితే, అతడు పెద్దగా దోచుకున్నది కూడా ఏమీ లేదని తెలుస్తోంది. షాప్ లో రికార్డయిన వీడియో ప్రకారం ఆ దుండగుడు కౌంటర్ లోని కొంత సొమ్మును మాత్రమే తీసుకున్నట్లు తెలుస్తోంది.
లేదా ఒక వస్తువు మాత్రమే తీసుకుని పరారయ్యాడనిపిస్తోంది.
కాగా, కుప్పకూలిన గోపీకృష్ణను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం చనిపోయాడు. జీవనోపాధి కోసం వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న అతడి ఉదంతం తెలిసి ఏపీలోని స్వగ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. కుటుంబ సభ్యుల కన్నీటికి అడ్డుకట్టే లేదు. కాగా, గోపీకి భార్య, కుమారుడు ఉన్నారు.
అమెరికాతో పాటు కెనడాలో ఇటీవల భారత సంతతి వ్యక్తులే టార్గెట్ గా దాడులు, హత్యలు జరుగుతున్న సంగతి తెలిసిందే. వాటిపై భారత ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరిస్తోంది. ఇంతలోనే మరో ఘటన. అందులోనూ బాధిత వ్యక్తి తెలుగువాడు కావడం విషాదకరం.