ఆ దేశంలో విషాదం.. ఇద్దరు తెలుగు విద్యార్థుల మృత్యువాత!
ఆస్ట్రేలియాలో దారుణ విషాదం చోటు చేసుకుంది. ఆ దేశంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు జలపాతంలో పడి మృత్యువాత పడ్డారు
ఆస్ట్రేలియాలో దారుణ విషాదం చోటు చేసుకుంది. ఆ దేశంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు జలపాతంలో పడి మృత్యువాత పడ్డారు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన చైతన్య గుంటూరులో బీటెక్ చేశాడు. ఆ తర్వాత ఎంఎస్ కోసం ఆస్ట్రేలియాకు వెళ్లాడు. చదువు పూర్తయ్యాక ఉద్యోగం రావడంతో ఆస్ట్రేలియాలోనే ఉంటున్నాడు. గతేడాది గుంటూరు యువతితో చైతన్యకు పెళ్లి కూడా అయ్యింది.
ఈ క్రమంలో చైతన్య తన స్నేహితులు, బాపట్ల జిల్లాకు చెందిన బొబ్బ సూర్యతేజ, మరో ముగ్గురితో కలిసి ఆస్ట్రేలియాలోని ఉత్తర క్వీన్స్ లాండ్ లో ఉన్న మిల్లా మిల్లా జలపాతం చూసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో సూర్యతేజ ప్రమాదవశాత్తూ జలపాతంలోకి జారిపడిపోయాడు. అతడిని కాపాడటానికి చైతన్య కూడా నీళ్లలో దిగాడు. అయితే ఇద్దరికి ఈత రాకపోవడం, ప్రవాహ ఉధృతి ఎక్కువగా ఉండటంతో నీళ్లలో కొట్టుకుపోయారు.
వారి మిత్రుల సహకారంతో ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హెలికాప్టర్ ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో చైతన్య, సూర్యతేజ ఇద్దరి మృతదేహాలు లభించాయి. పోస్టుమార్టం పూర్తయ్యాక వారి మృతదేహాలను భారత్ కు పంపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
కాగా చైతన్య భార్య ప్రస్తుతం గుంటూరులోనే ఉందని తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం ఆమె ఆస్ట్రేలియా నుంచి కుటుంబ పనుల నిమిత్తం గుంటూరు వచ్చారని సమాచారం. భర్త మృతి వార్తతో ఆమె కన్నీరుమున్నీరవుతున్నారు. కాగా చైతన్య సోదరి అమెరికాలో ఉంటున్నారని చెబుతున్నారు. అతడి తండ్రి రామారావు పదేళ్ల క్రితం పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారని తెలుస్తోంది. ఇంతలో మళ్లీ ఈ విషాధం చోటు చేసుకోవడంతో భార్య, చైతన్య తల్లి తీవ్ర విషాదంలో ఉన్నారు.
జలపాతంలో పడి ప్రాణాలు పోగొట్టుకున్న మరో తెలుగు యువకుడు సూర్యతేజ గురించి వివరాలు తెలియాల్సి ఉంది. ఆస్ట్రేలియాలో ఉన్న స్థానిక తెలుగు సంఘాల సాయంతో మృతదేహాలను ఏపీకి తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.