భగవద్గీత సాక్షిగా బ్రిటన్ ఎంపీ ప్రమాణం... వీడియో వైరల్!

ఈ సందర్భంగా తాజాగా జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో... శివానీ రాజా భగవద్గీతపై ప్రమాణం చేసి ఎంపీగా బాధ్యతలు చేపట్టారు.

Update: 2024-07-11 04:59 GMT

బ్రిటన్ పార్లమెంట్ లో ఎంపీలు ప్రమాణస్వీకారం చేసేటప్పుడు భగవద్గీతను చేతిలో ఉంచుకుని నిబంధన ప్రకారం ప్రమాణం చేస్తుండటం ఇటీవల దాదాపు ప్రతీసారీ జరుగుతున్న సంగతి తెలిసిందే. గతంలో భారత సంతతి ఎంపీలు అలోక్ శర్మ, రుషి సునక్ లు భగవద్గీతపై ప్రమాణం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా శివానీ రాజా కూడా అలానే ప్రమాణం చేశారు.

అవును.. ఇటీవల జరిగిన బ్రిటన్ ఎన్నికల్లో భారత సంతతి మహిళా వ్యాపారవేత్త, కన్జర్వేటివ్ పార్టీ నేత శివానీ రాజా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... లీసెస్టర్ ఈస్ట్ స్థానం నుంచి ఎన్నికల బరిలో నిలిచిన ఆమె... లేబర్ పార్టీకి చెందిన రాజేష్ అగర్వాల్ పై భారీ మెజారిటీతో గెలుపొందారు. ఫలితంగా... తాజాగా ఆమె బ్రిటన్ దిగువ సభలో అడుగుపెట్టారు.

ఈ సందర్భంగా తాజాగా జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో... శివానీ రాజా భగవద్గీతపై ప్రమాణం చేసి ఎంపీగా బాధ్యతలు చేపట్టారు. భగవద్గీత సాక్షిగా, బ్రిటన్ రాజు విశ్వసనీయురాలిగా ఉంటానంటూ ప్రమాణం చేశారు. ఈ విషయాన్ని ఆమె ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. తన జీవితంలో ఇది మరిచిపోలేని రోజంటూ తన సంతోషాన్ని పంచుకున్నారు.

కాగా... ఇటీవల జరిగిన బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో శివానీ రాజాకు 14,526 ఓట్లు రాగా.. తన ప్రత్యర్థి రాజేష్ అగర్వాల్ కు 10,100 ఓట్లే వచ్చాయి.

ఇక ఈ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన 27 మంది దిగువ సభకు ఎంపీలుగా ఎన్నికయ్యారు. ఇదే సమయంలో రికార్డ్ స్థాయిలో 263 మంది మహిళలు ఎంపీలుగా గెలుపొందారు. అదేవిధంగా శ్వేతజాతీయేతర ఎంపీల సంఖ్య కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా 90కి చేరడం గమనార్హం.

Tags:    

Similar News