కవితపై 1000మంది రైతుల పోటీ.. ఎందుకంటే

Update: 2019-02-27 05:23 GMT
రైతుల లొల్లి కేసీఆర్ కూతురు, నిజామాబాద్ ఎంపీ కవిత మెడకు చుట్టుకుంటోంది. రానున్న లోక్ సభ ఎన్నికల వేళ ఇది ఆమెకు గుదిబండగా మారుతోంది. దేశంలోనే ఎవ్వరికీ రాని అనుభవాన్ని ఆమెకు కల్పించేందుకు రైతన్నలు సిద్ధమవ్వడం ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది.

తాజాగా నిజామాబాద్, జగిత్యాల, ఆర్మూర్, కరీంనగర్ ప్రాంతాలకు చెందిన పసుపు, ఎర్రజొన్న రైతులు తమకు గిట్టుబాటు ధర కల్పించాలని  గడిచిన 20 రోజులుగా నిజామాబాద్ జిల్లాలో రోడ్డెక్కారు. ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో జేఏసీగా ఏర్పడి 20 రోజులుగా రోజుకో నిరసన తెలుపుతున్నారు.

అయితే ఇంత రచ్చ జరుగుతున్న నిజామాబాద్ ఎంపీ కవిత గానీ,, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ స్పందించిన పాపాన పోలేదు. దీంతో టీఆర్ఎస్ పై రగిలిపోతున్న రైతన్నలు కవితకు రానున్న ఎన్నికల్లో బుద్ది చెప్పాలని మాస్టర్ ప్లాన్ రెడీ చేశారు. నిజామాబాద్ ఎంపీ స్థానం నుంచి వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కవితకు పోటీగా 200 గ్రామాల నుంచి 1000 మంది రైతులు పోటీపడాలని నిర్ణయించారు. పోటీకి సంబంధించిన నామినేషన్ ఫీజును గ్రామ కమిటీల ద్వారా చందాలుగా వసూలు చేయాలని నిర్ణయించారు.

అయితే కవితపై తాము గెలవాలని ఇలా చేయడం లేదని.. తమ పరిస్థితిని దేశమంతటికీ తెలియజెప్పేలా చేయడమే తమ లక్ష్యమని రైతులు చెబుతున్నారు. ఇలా కవితకు షాకిచ్చేందుకు రైతులంతా ఏకం కావడం రాజకీయంగా సంచలనంగా మారింది.

ఇలానే 1996లో కూడా నల్గొండ జిల్లాలో ఎస్ఎల్బీసీ కాలువను పూర్తి చేయడం లేదని రైతులు 480 మంది నల్గొండ ఎంపీ ఎన్నికల్లో నామినేషన్ వేశారు. అప్పుడు అంత పెద్ద బ్యాలెట్ రెడీ చేసి ఎన్నికలు నిర్వహించడం కష్టసాధ్యమైంది. సార్వత్రిక ఎన్నికలు జరిగిన నెలరోజులకు ఈ ఎన్నిక నిర్వహించాల్సి వచ్చింది. అలా దేశం దృష్టిని అప్పుడు నల్గొండ రైతులు ఆకర్షించారు. కానీ ఆ ఎన్నికల్లో సీపీఐ ఎంపీ అభ్యర్థి ధర్మభిక్షం గెలిచారు. ఇప్పుడు కవితకు కూడా అలాంటి షాక్ ఇవ్వడానికి రైతులు రెడీ కావడం విశేషం.
Tags:    

Similar News