టీడీపీ ఎమ్మెల్యే దగ్గర రూ.18 కోట్ల క్యాష్

Update: 2015-12-16 18:13 GMT
ముఖ్యమంత్రుల ఇళ్లు.. కార్యాలయాలే దిక్కుల్లేని పరిస్థితి. దేశంలో ఏ విచారణ సంస్థ ఎవరి మీద దాడులు చేస్తుందో? సోదాలు నిర్వహిస్తుందో అర్థం కాని పరిస్థితి. అత్యున్నత స్థాయి వ్యక్తుల ఇళ్లు.. ఆఫీసుల్లో సోదాలు నిర్వహించే సమయంలో వెనుకా ముందు చూసుకోవటం అన్నది లేకుండా విచారణ అధికారులు దూసుకుపోతున్న కాలంలో ఒక ఎమ్మెల్యే ఎంత? సరిగ్గా ఇలాంటి పరిస్థితే మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డికి ఎదురైంది.

బుధవారం రాజేందర్ రెడ్డి ఇంటిపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆయన ఆఫీసు.. ఇంట్లో కలిపి ఏకకాలంలో నిర్వహించిన సోదాల్లో ఏకంగా రూ.18కోట్ల క్యాష్ ను స్వాధీనం చేసుకోవటం సంచలనం సృష్టిస్తోంది. బ్యాంకులో డిపాజిట్ చేయాల్సిన మొత్తాన్ని ఆపీసు లాకర్లో పెట్టినట్లుగా తెలుస్తోంది. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఐటీ అధికారులు దాడులకు పాల్పడినట్లుగా తెలుస్తోంది.

ఎమ్మెల్యే ఇంట్లో.. కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్న ఐటీ అధికారులంతా కర్ణాటకకు చెందిన వారు కావటం గమనార్హం. గుల్బార్గా.. బెంగళూరుకు నుంచి వచ్చిన 30 మంది ఐటీ అధికారులు తాజాగా తనిఖీలు చేపట్టినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ లోని ఆయన ఇళ్లల్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నట్లు చెబుతున్నారు. పెద్ద మొత్తంలో నగదు బయట పడటం ఇప్పుడు సంచలనంగా మారింది.
Tags:    

Similar News