గుండె నొప్పిని కనిపెట్టే కారు.. ఆ ప్రమాదాలకూ చెక్!

Update: 2021-11-07 01:30 GMT
సాంకేతికత రోజురోజుకూ కొత్తపుంతలు తొక్కుతోంది. మారుతున్న మనుషుల అలవాట్లకు అనుగుణంగా... మానవుల పనిని సులభం చేసేందుకు కొత్త కొత్త వ్యవస్థలు పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా ఆటోమొబైల్ రంగంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వివిధ రకాలైన వాహనాలు అధునాత ఫీచర్లతో మార్కెట్లోకి అడుగుపెడుతున్నాయి. వీటిని కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఆసక్తి కనబరుస్తున్నారు. దీనినే ప్రామాణికంగా తీసుకున్న ఎన్నో సంస్థలు ఇప్పటికే డ్రైవర్తో పని లేకుండానే నడిచే కార్లు, వాహనదారుడు నిద్రపోతుంటే.. మేల్కొల్పి హెచ్చరించే కార్లు అందుబాటులోకి వచ్చాయి. వీటితో పాటే మ్యాప్స్ ను ఆధారంగా చేసుకొని.. వేగంగా, తక్కువ దూరంతో మన గమ్యాన్ని చేర్చే కార్లు కూడా ఆటోమొబైల్ రంగంలోకి అడుగు పెట్టి వాహనదారులకు కిక్కెక్కిస్తున్నాయి.

మార్కెట్ లోకి కొత్త వాహనాన్ని పరిచయం చేసేటప్పుడు వినియోగదారుల అభిరుచులను, ఆసక్తిని, ముఖ్యంగా వారి భద్రతను దృష్టిలో పెట్టుకుంటున్నాయి తయారీ సంస్థలు. అయితే జపాన్ కు చెందిన కార్ల సంస్థ మజ్‌దా .. వినియోగదారుల భద్రతను ప్రామాణికంగా చేసుకొని ఓ కొత్త కారును సిద్ధం చేస్తోంది. అది ఏమిటంటే.. ఆ కారును నడుపుతున్నప్పడు డ్రైవర్ కు సడెన్ గా గుండె నొప్పి వస్తే.. వెంటనే గుర్తించి వారిని సేఫ్ ప్లేస్ కు తరలిస్తుంది. ఇందుకుగానూ కార్లో కో పైలెట్ మోడ్ ను అభివృద్ధి చేసింది ఆ సంస్థ. ఈ కో పైలెట్ మోడ్ అనేది యాక్టివేషన్ అయిన తరువాత కారు తనంతట అదే సురక్షిత ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంటుంది. అలా ఒక చోట కదలకుండా ఆగిపోతుందని సంస్థ ప్రతినిధులు చెప్పుకొచ్చారు. ఈ ఆప్షన్ కేవలం గుండె నొప్పి వచ్చినప్పుడు మాత్రమే కాదని.. ఇతర ఆరోగ్య సమస్యలు ఏవైనా డ్రైవర్ ను ఇబ్బంది పెడితే కూడా ఆ సీటులో ఉండే వారి ముఖకవళికలు గమనించి కదలకున్నా కూడా సేఫ్ ప్రాంతానికి తీసుకెళ్తుందని ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు..

ఈ కార్లను మార్కెట్ లోకి తీసుకుని రావాలి అంటే మరింత సమయం పడుతుందని చెప్తుంది మజ్‌దా సంస్థ. 2025 నాటికి పూర్తి స్థాయిలో ఈ కార్లను అభివృద్ధి చేసి విపణిలోకి ప్రవేశపెడతామని ప్రకటించింది. డ్రైవర్ కు గుండె నొప్పి రావడం అనేది కార్లలో ఉండే అంతర్గత కెమెరాల ద్వారా తెలుస్తుందని వెల్లడించింది. ఇవి చోదకుడిలో వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు పరిశీలించి... వాటిని విశ్లేషించి ప్రమాదాన్ని ముందుగానే పసిగడతాయని పేర్కొంది. ఇలా ఓసారి గుర్తించిన వెంటనే అందులోని ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ సరైన వాతావరణాన్ని కల్పించేందుకు ప్రయత్నిస్తుందని సంస్థ ప్రతినిధులు చెప్పారు. అంతేగాకుండా డ్రైవర్ కు వచ్చిన గుండె పోటు తీవ్రతను హెచ్చరిక లైట్లను వేస్తుందని వివరించారు. ఫలితంగా అటుగా వెళ్లే వారు దానిని గమనించి బాధితులను రక్షించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

ఇదే కారులో మరో ఫీచర్ ను కూడా అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తోంది మజ్దా. సాధారణంగా ప్రమాదాలు జరిగినప్పుడు మొదటగా సమాచారం ఇవ్వాల్సిన ప్రధాన వ్యక్తులు అయిన పోలీస్, వైద్య సిబ్బందికు దీనిని నుంచి మెసేజ్ వెళ్లేలాగా రూపొందించాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది ఆ సంస్థ. ఏటా కారు డ్రైవింగ్ చేస్తా.. ఇలా ప్రాణాలు వదిలేసిన ఎంతో మందిని చూసి తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఇదే పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఇలాంటి వాటికి చెక్ పెట్టవచ్చునని మజ్‌దా సంస్థ భావిస్తోంది. ఈ కారుకు సంబంధించిన మరికొన్ని ఫీచర్లు తెలియాలంటే 2025 వరకు ఆగాల్సిందే మరి!
Tags:    

Similar News