నా పొలాన్ని అలా చేస్తావా? మహిళా అధికారిపై పెట్రోల్ సీసా తీసిన రైతు

Update: 2019-11-07 04:50 GMT
హైదరాబాద్ నగర శివారులో అబ్దుల్లాపూర్ మెట్ తహిసిల్దార్ విజయారెడ్డిపై పెట్రోల్ పోసి చంపేసిన ఉదంతం ఒక కొలిక్కి రాక ముందే.. దాదాపు అలాంటి ఉదంతమే తాజాగా ఏపీలో చోటు చేసుకుంది. తాను వెంట తెచ్చిన పెట్రోల్ సీసాను బయటకు తీసిన వైనం వణుకు తెప్పించింది. హైదరాబాద్ దుర్మార్గం రానున్న రోజుల్లో మరిన్ని విపరిణామాలకు దారి తీస్తుందన్న మాటలకు తగ్గట్లే.. తాజా ఉదంతం చోటు చేసుకుంది.

తన పొలంలో మురుగు కాలువ నిర్మించి ఎందుకు పనికి రాకుండా చేశారన్న అభ్యంతరాన్ని వ్యక్తం చేసిన రైతు.. పంచాయితీ మహిళా ఉద్యోగినిపై పెట్రోల్ పోసి చంపే ప్రయత్నం చేయటం.. అది కూడా రైతుభరోసా కార్యక్రమంలో అందరి ముందు కావటం సంచలనంగా మారింది. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం దూకలపాడులో చోటు చేసుకున్న ఈ వైనం షాకింగ్ గా మారింది.

రైతు భరోసా గ్రామసభను ఏర్పాటు చేయగా.. తమ సమస్యల్ని చెప్పుకునేందుకు రైతులు హాజరయ్యారు. ఈ సభకు అల్లు జగన్మోహన్ రావు అనే రైతు హాజరయ్యాడు. గ్రామ పంచాయితీ కార్యదర్శి సుమలతపై తీవ్రస్థాయిలో మండిపడుతూ.. తన పొలంలో మురికి కాలువ తవ్వించటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ప్రభుత్వం నుంచి ఎలాంటి పథకం రాకుండా చేస్తున్నారని ఆరోపిస్తూ.. నిన్ను పెట్రోల్ పోసి చంపేస్తా.. నేనూ చచ్చిపోతా అంటూ బ్యాగ్ లో నుంచి పెట్రోల్ బాటిల్ తీసి తన మీద చల్లుకున్నాడు.

ఈ హఠాత్ పరిణామానికి ఒక్కసారి అక్కడున్నోళ్లు షాక్ తిన్నారు. పెట్రోల్ బాటిల్ ఓపెన్ చేసి తన మీద చల్లుకునే క్రమంలో అక్కడున్న కొందరిపైనా పెట్రోల్ పడింది. అగ్గిపుల్ల తీసి వెలిగించే ప్రయత్నం చేసిన ఆ రైతును అక్కడి వారు అడ్డుకోగా.. పంచాయితీ ఉద్యోగులు.. వలంటీర్లు.. సచివాలయ ఉద్యోులు భయంతో పరుగులు తీశారు. పంచాయితీ కార్యదర్శి సుమలత కంప్లైంట్ మేరకు సదరు రైతును అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ ఉదంతం రానున్న రోజుల్లో అధికారులకు పీడకలగా మారే అవకాశం ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది.
Tags:    

Similar News