ఛీ..ఛీ.. ఇలాంటి తల్లులు కూడా ఉంటారా?

Update: 2020-08-30 08:50 GMT
కొన్ని ఉదంతాలు తెలిసినంతనే.. ఇలాంటివి కూడా జరుగుతాయా? అన్న సందేహం కలుగక మానదు. ఓపక్క ప్రపంచం డిజిటల్ యుగానికి చేరువై దూసుకుపోతుంటే.. మరోవైపుకొందరు మాత్రం రాతి యుగం నాటి పద్దతుల్ని నమ్మే తీరు చూస్తే..జీర్ణించుకోలేని పరిస్థితి. ఒక స్వామీజి మీద ఉన్న నమ్మకం.. మూర్ఖత్వంతో కూతురు జీవితాన్ని నాశనం చేయటమే కాదు.. తనను అత్యాచారం చేస్తున్నాడని భోరుమన్నా.. అదంతా ట్రీట్ మెంట్ లో భాగంగా అంటూ సర్ది చెప్పిన తల్లి తీరు షాకివ్వక మానదు.

హర్యానాలో చోటు చేసుకున్న ఈ ఉదంతం గురించి తెలిస్తే.. ఎవరికి ఇలాంటి తల్లి మాత్రం ఉండకూడదనుకోవటం ఖాయం. అమ్మతనానికి మచ్చగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే.. యమునా నగర్ జిల్లాలోని ఒక గ్రామానికి చెందిన ప్లస్ టూ చదివే అమ్మాయికి తరచూ కడుపునొప్పి వస్తుండేది. వైద్యం కోసం డాక్టర్ వద్దకు వెళితే.. కడుపులో ట్యూమర్ ఉందని.. సర్జరీ చేయాలని తేల్చారు. వైద్యుల మాటని పట్టించుకోని తల్లి.. తనకున్న మూర్ఖత్వంతో మంత్రశక్తులతో నయమవుతుందని భావించింది.

తన పుట్టిల్లు అయిన బీబీపూర్ జట్టాన్ గ్రామంలోని స్వామీజీ వద్దకు తన కుమార్తెను తీసుకెళ్లింది. సమస్యను చెప్పగా.. తాను నయం చేస్తానని నమ్మకంగా చెప్పి.. ఏకాంతంలో పూజ చేస్తానని చెప్పి బాలికపై అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని ఇంట్లో వాళ్లకి చెబితే వారిని మంత్రశక్తులతో చంపేస్తానని హెచ్చరించాడు. దీంతో.. భయపడిన ఆ అమ్మాయి తల్లికి జరిగిందంతా చెప్పి భోరుమంది. అయితే.. మూర్ఖురాలైన ఆమె తల్లి.. స్వామీజీ ఏం చెబితే అది చేయాలని.. అదంతా వైద్యంలో భాగంగా సర్ది చెప్పేది.

బాధితురాలి తల్లి తీరుతో మరింత రెచ్చిపోయిన దొంగ స్వామీజీ.. నాలుగు రోజుల పాటు ప్రత్యేక పూజలు చేస్తానని చెప్పి.. ఆమెను ఏకాంతంగా బంధించి.. చెలరేగిపోయాడు. నానా హింసకుగురి చేశాడు. దీంతో.. తనపై జరుగుతున్న లైంగిదాడిని తండ్రికి చెప్పింది. దీంతో.. అతను పోలీసులకు ఫిర్యాదు చేయటంతో విచారించిన పోలీసులు.. దొంగ స్వామీజీని అరెస్టు చేశారు. ఇదంతా చదివిన తర్వాత ఈ తరహా ఉదంతాలు ఇప్పటి రోజుల్లో జరుగుతాయా? అన్న సందే హం కలుగక మానదు.
Tags:    

Similar News