ప్రాణపాయ స్థితిలో భారత సంతతి మహిళ..!

Update: 2022-12-31 08:30 GMT
అమెరికాలో జరిగిన ఘోర ప్రమాదం ఓ భారత సంతతి కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. క్రిస్మస్ రోజున ఆరవ్ లాస్ వెగాస్ నుండి తిరిగి వస్తుండగా జరిగిన యాక్సిడెంట్లో రెండేళ్ల చిన్నారి మృతి చెందగా భార్యభర్తలు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో చిన్నారి తల్లి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉండటం శోచనీయంగా మారింది.

ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. శ్రావ్య ముత్యాల.. ఆమె భర్త రవీందర్ ముత్యాల అమెరికాలో స్థిరపడ్డారు. వీరికి రెండేళ్ల కుమారుడు ఉన్నారు. అయితే గతంలోనే ఎన్నడూ లేనివిధంగా అమెరికాలో మంచు తుఫాను బీభత్సం సృష్టిస్తుంది. దీంతో జనజీవనం ఎక్కడిక్కడ స్తంభించిపోయింది.

ఈ నేపథ్యంలోనే కొన్ని ఏరియాల్లో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. న్యూయార్.. పెన్సిల్వేనియా తదితర నగరాల్లో కురుస్తున్న మంచు తుఫాను దాటికి అనేక మంది ప్రజలు గడ్డకట్టుకొని చనిపోయిన ఘటనలు ఉన్నాయి. అమెరికాలో వాతావరణ శాఖ అధికారులు సైతం ప్రజలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూనే ఉన్నారు.

అయితే క్రిస్మస్ సందర్భంగా ప్రజలు తప్పనిసరిగా బయటకు రావాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఈ క్రమంలోనే రవీందర్ ముత్యాల తన కుటుంబంతో కలిసి కారులో ఆరవ్ లాస్ వెగాస్ నుండి తిరిగి వస్తుండగా జరిగిన యాక్సిడెంట్ జరిగింది. ఈ ఘటనలో తన రెండేళ్ల కుమారుడు స్పాట్లో మృతిచెందగా అతని భార్య శ్రావ్య ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది.

ఈ ప్రమాదంలో రవీందర్ స్వల్ప గాయాలతో బయట పడ్డాడు. మంచు కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని యూఎస్ పోలీసులు అంచనా వేస్తున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న భారత సంతతి మహిళ శ్రావ్యను కాపాడేందుకు అమెరికాలో ఫండ్ రైజ్ చేపట్టారు.

గో ఫండ్ మీ (GoFundMe) పేరిట ఒక పేజీ క్రియేట్ చేసి శ్రావ్య కోసం నిధులను సేకరిస్తున్నారు. అమెరికాలో భారతీయ కుటుంబం ప్రమాదానికి గురి కావడం బాధకరమని గో ఫండ్ మీ పేజీ అడ్మిన్ ఆవేదన వ్యక్తం చేశారు. ''ఈ వర్ణించలేని బాధ.. దుఃఖంలో.. మేము ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని.. ఆమె కుటుంబం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను తగ్గించాలని కోరుకుంటున్నాం'' అని పేర్కొన్నారు.

ఈ కష్ట సమయాల్లో శ్రావ్య.. ఆమె కుటుంబాన్ని ఆదుకోవడానికి తమవంతు బాధ్యతగా నిధులు సేకరిస్తున్నామని తెలిపారు. దాతలు ముందుకు వచ్చి సహాయం అందించాలని కోరారు. ఈ డబ్బును శ్రావ్య వైద్య ఖర్చుల కోసం వినియోగిస్తామని గో ఫండ్ మీ పేజీ నిర్వాహకులు తెలిపారు.

కాగా ఈ ప్రమాదానికి ఒక రోజు ముందు పెన్సిల్వేనియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హర్యానాకి చెందిన 26 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. అలాగే డిసెంబర్ 26న అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో గడ్డకట్టిన సరస్సులో నడుస్తుండగా మంచులో ముగ్గురు భారతీయ అమెరికన్లు మృతి చెందడం విషాదాన్ని నింపింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News