హైదరాబాద్‌లో విషాదం..నడిరోడ్డుపై యువకుడి మృతి, కరోనా భయంతో పట్టించుకోని జనం

Update: 2020-07-08 16:00 GMT
కరోనా మహమ్మారి రోజురోజుకి విజృంభిస్తూ.. మనుషులలో ఉన్న మానవత్వాన్ని చంపేస్తుంది. కరోనా దెబ్బకి ఎదుటి వారికి సాయం చేసేందుకు కూడా జనం భయపడుతున్నారు. ఓ యువకుడు నడిరోడ్డుపై పడిపోతే..కరోనా భయంతో ఆ వైపు తొంగి చూడటానికి కూడా ఎవరు సాహసం చేయలేదు. అతడితో పాటు ఉన్న ఇద్దరు మహిళలు సాయం కోసం ఎంతగా ప్రాధేయపడినా... చుట్టూ ఉన్న వాళ్లు పట్టించుకోని పరిస్థితి. చివరికి 108 సిబ్బంది వచ్చి ఆస్పత్రి తరలించే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. అప్పటికే ఆ యువకుడి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

ఈ విషాద ఘటన ఈసీఐఎల్‌ చౌరస్తాలో బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. మృతుడిని జవహర్ ‌నగర్‌ కు చెందిన పృథ్వీరాజ్‌గా గుర్తించారు. గత మూడు రోజులుగా జ్వరం రావడంతో అతడిని స్థానికంగా ఉండే ఆస్పత్రికి తీసుకెళ్లారు. అతడిని పరీక్షించిన వైద్యలు పెద్దాసుపత్రికి తరలించాలని సూచించారు. దీంతో వారు ఆటోలో తరలించేందుకు యత్నిస్తుండగా యువకుడు నడిరోడ్డుపై కింద పడ్డాడు. అయితే చుట్టుప్రక్కల ఉన్న వాళ్లు దూరంగా నిలబడి చూశారే తప్ప అతడికి సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. సాయం కోసం అతడితో వచ్చిన ఇద్దరు మహిళలు ఎదురుచూశారు. 108 అంబులెన్స్‌కు కొందరు ఫోన్ చేశారు. అయితే అంబులెన్స్ వచ్చేలోపు అతడు చనిపోయాడు. అయితే అతడు కరోనా కారణంగానే చనిపోయాడా లేక ఇతర అనారోగ్యంతో కన్నుమూశాడా అన్నది తెలియాల్సి ఉంది.
Tags:    

Similar News