ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలకు షాకిచ్చిన ప్రివిలేజ్ కమిటీ .. ఎవరంటే

Update: 2020-12-23 09:30 GMT
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ గత సమావేశాల్లో చోటు చేసుకున్న రెండు సంఘటనల్లో ప్రభుత్వం, స్పీకర్‌ పై అనుచితంగా వ్యవహరించిన ఆరోపణలపై ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేల భవితవ్యం తేల్చేందుకు సభా హక్కుల కమిటీ నేడు భేటీ అయింది. అసెంబ్లీ కాన్ఫరెన్స్‌ హాల్లో ప్రివిలేజ్‌ కమిటీ ఛైర్మన్‌ కాకాణి గోవర్ధన్ ‌రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ సమావేశమైంది.

ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీ సభ్యులు అచ్చెన్నాయుడు, రామానాయుడు వివరణ ఇచ్చేందుకు పది రోజుల సమయం ఇచ్చింది ప్రివిలేజ్‌ కమిటీ. వారిపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆమోదించిన సభా హక్కుల ఉల్లంఘన నోటీసుపై చర్చించింది. సీఎం జగన్ ‌తోపాటు మంత్రి కన్నబాబుపై టీడీపీ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుల్ని స్పీకర్‌ ఇంకా తమకు రిఫర్‌ చేయలేదని స్పష్టం చేశారు కమిటీ చైర్మన్‌ కాకాని గోవర్ధన్‌. మరోవైపు, మద్యపాన నిషేధం అంశంలో అచ్చెన్నాయుడు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని చీఫ్‌విప్‌ శ్రీకాంత్‌రెడ్డి ఒక నోటీసు ఇచ్చారు. స్పీకర్‌ను దూషిస్తూ ప్రెస్‌నోట్‌ విడుదల చేసినందుకుగాను అచ్చెన్నాయుడిపైనే జోగి రమేష్‌ మరో నోటీసు ఇచ్చారు.

ఇక, చేయూత పథకం పై నిమ్మల రామానాయుడు కావాలనే సభను తప్పుదోవ పట్టిస్తున్నారని సీఎం జగనే స్వయంగా నోటీసు ఇచ్చారు. వీటిపైనే ఇవాళ సమావేశమైన ప్రివిలేజ్‌ కమిటీలో చర్చించారు. దీనిపై చర్చించి పది రోజుల సమయం ఇస్తున్నట్లు చెప్పారు కాకాని గోవర్ధన్‌. కాగా, వచ్చే నెలలో తిరుపతిలో మరోసారి ప్రివిలేజ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందంటున్నారు. ప్రివిలేజ్‌ కమిటీ సమావేశం అనంతరం మాట్లాడిన ఛైర్మన్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి.. ప్రతీ శాసనసభ్యుడి హక్కులను కాపాడేందుకు తాము పనిచేస్తామన్నారు. స్పీకర్ రిఫర్‌ చేసిన వాటిని కూడా పరిశీలించి చర్చించినట్లు ఆయన వెల్లడించారు. సంబంధిత ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చిన తర్వాత వారి వివరణ తీసుకుని చర్యలు చేపట్టనున్నట్లు కాకాణి తెలిపారు.
Tags:    

Similar News