అలీది కామెడీనా?... క‌న్‌ఫ్యూజ‌నా?

Update: 2019-01-06 18:37 GMT
టాలీవుడ్ స్టార్ క‌మెడియ‌న్ అలీ... ఇప్పుడు చాలా పెద్ద కామెడీకే తెర తీశారు. సిల్వ‌ర్ స్క్రీన్‌పై అలీ పండించే కామెడీకి క‌డుపుబ్బా న‌వ్వుకుంటున్న జ‌నం... రాజ‌కీయ య‌వ‌నిక‌పై అలీ చేస్తున్న మంత్రాంగం అర్ధం కాక త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. అయినా ఇప్ప‌టికే రాజ‌కీయాల్లో త‌ల‌లు పండిన నేత‌ల‌ను చూసిన జ‌నం అలీ పొలిటిక‌ల్ కామెడీని ప‌ట్టించుకునే స్థితిలో లేకున్నా... క‌నీసం అత‌డు ఏం చేస్తున్నాడ‌న్న దానిపై అయితే దృష్టి సారిస్తారు క‌దా. అంతేకాకుండా ఇంకో ఐదు నెల‌ల్లో ఎన్నిక‌లు జ‌రుగుతున్న నేపథ్యంలో అలీ చేస్తున్న హ‌డావిడి ఒకింత ప్రాధాన్యం సంత‌రించుకున్న మాట వాస్త‌వ‌మే. మొన్న‌టికి మొన్న వైసీపీ అదినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో క‌లిసి కూర్చున్న అలీ... స‌ద‌రు ఫొటోలు బ‌య‌ట‌కు రాగానే అస‌లు త‌న‌కేమీ ప‌ట్ట‌న‌ట్టుగానే వ్య‌వ‌హ‌రించాడు. జ‌గ‌న్‌తో అలీ చాలా ఇంట‌రెస్టింగ్‌గా చ‌ర్చిస్తున్న‌ట్లు ఉన్న స‌ద‌రు ఫొటోలు చూసిన జ‌నం... అలీ నిజంగానే రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నార‌ని, వైసీపీలో చేర‌బోతున్నార‌ని, త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన ప్ర‌క‌ట‌న రానుంద‌ని ఏవేవో ఊహించుకున్నారు. సోష‌ల్ మీడియాలో కూడా ఈ ఫొటోతో పాటు దానిపై ప‌లు ర‌కాల విశ్లేష‌ణ‌ల‌తో కూడిన వార్త‌లు కూడా వైర‌ల్ అయ్యాయి.

ఇక నిన్న‌టికి నిన్న జ‌గ‌న్ పాద‌యాత్ర ముగింపు సంద‌ర్భంగా అలీ వైసీపీలోకి చేరిపోతున్నార‌ని, త‌న సొంతూరు అయిన రాజ‌మ‌హేంద్ర‌వ‌రం నుంచి పోటీకి దిగ‌నున్నార‌న్న వార్త కూడా నెట్టింట వైర‌ల్ అయ్యింది. అయితే వాటిపై అలీ నోరు విప్పిన దాఖ‌లా లేదు. తాజాతా నేటి ఉద‌యం ఇంటి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన అలీ... జ‌నంతో పాటు మీడియాను కూడా త‌న వెంట ప‌రుగులు పెట్టించార‌ని చెప్పాలి. పొద్దున్నే అమ‌రావ‌తి వ‌చ్చేసి అలీ... నేరుగా టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు వ‌ద్ద‌కు వెళ్లారు. అప్ప‌టికే జ‌న్మ‌భూమి కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యేందుకు బ‌య‌లుదేరేందుకు సిద్ధ‌మ‌వుతున్న చంద్ర‌బాబు... అలీ రాగానే అత‌డితో కూర్చుని మాట్లాడార‌ట‌. దాదాపు అర‌గంట పాటు ఏకాంతంగా చ‌ర్చ‌లు జ‌రిగిన మీద‌ట చంద్ర‌బాబు జ‌న్మ‌భూమికి వెళ్లిపోగా... అలీ మాత్రం సీఎం క్యాంపు ఆఫీస్ బ‌య‌ట‌కు వ‌చ్చి... అక్క‌డ త‌న కోసం వేచి చూస్తున్న మీడియాతో సింగిల్ మాట కూడా మాట్లాడ‌కుండానే తుర్రుమ‌న్నాడు. ఆ త‌ర్వాతైనా బుద్ధిగా ఇంటికి చేరుకున్నాడా? అంటే... అదీ లేదు. బాబుతో భేటీ త‌ర్వాత టాలీవుడ్‌లో త‌న‌కు అత్యంత స‌న్నిహితుడ‌ని పేరున్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌ద్ద‌కు ప‌రుగులు పెట్టారు. అక్క‌డ కూడా అలీ దాదాపుగా రెండు గంట‌ల‌కు పైగానే ప‌వ‌న్‌తో చ‌ర్చోప‌చ‌ర్చ‌లు నిర్వ‌హించాడ‌ట‌. ఆ త‌ర్వాత అక్క‌డి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన అలీ... అక్క‌డా మీడియాతో మాట్లాడ‌కుండానే వెళ్లిపోయాడ‌ట‌.

మొత్తంగా చూస్తుంటే... మీడియాలో త‌న‌కు సంబంధించిన వార్త‌లు వైర‌ల్‌గా మారుతున్న వైనాన్ని ఎంజాయ్ చేస్తూ అలీ సాగిన‌ట్టుగా విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. ఓ వైపు ప‌వ‌న్‌తో స‌న్నిహిత సంబంధాలు, మ‌రోవైపు టీడీపీకి అనుకూలుడుగా పేరున్న అలీ... జగ‌న్‌ను క‌ల‌వ‌డ‌మే ఆశ్చ‌ర్యం రేకెత్తిస్తే... నేటి రెండు మీటింగుల ద్వారా అలీ మ‌రింత క‌న్‌ఫ్యూజ‌న్ క్రియేట్ చేశాడ‌నే చెప్పాలి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ మూడు పార్టీల్లో ఏ ఒక్క పార్టీ కూడా మిగిలిన పార్టీల‌తో పొత్తు పెట్టుకునే అవ‌కాశాలు దాదాపుగా క‌నిపించ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో మూడు పార్టీల అధినేత‌ల‌తో వ‌రుస‌గా భేటీలు నిర్వ‌హించేసి... అస‌లు ఈ భేటీలు ఎందుకు నిర్వ‌హించాన‌న్న విష‌యాన్ని చెప్ప‌కుండానే అలీ వెళ్లిపోయిన తీరుపై ఇప్పుడు స‌ర్వ‌త్రా అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అస‌లు అలీకి రాజ‌కీయాల్లోకి రావాల‌న్న ఆసక్తి ఉందా?  లేదంటే... కేవ‌లం హైప్ క్రియేట్ చేసేసి... జ‌నాన్ని క‌న్‌ఫ్యూజ్ చేయ‌డానికే ఈ భేటీలు నిర్వ‌హిస్తున్నాడా? అన్న‌ది తేలాల్సి ఉంది.

Tags:    

Similar News