అలీ ఫోర్త్ మీట్‌!..అస‌లు విష‌యం వ‌చ్చేసింది!

Update: 2019-01-09 04:10 GMT
సీనియ‌ర్ న‌టుడు అలీ... తొలుత జ‌గ‌న్‌తో, ఆ త‌ర్వాత చంద్ర‌బాబుతో, ఆ త‌ర్వాత ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో వ‌రుస భేటీలు నిర్వ‌హించాడు. ఈ మూడు సంద‌ర్భాల్లో బ‌య‌ట‌ప‌డ‌ని అలీ... నాలుగో సారి ఏపీ మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావుతో నిర్వ‌హించిన భేటీ సంద‌ర్భంగా త‌న మ‌న‌సులోని మాట‌ను బ‌య‌ట‌పెట్టేసుకున్నారు. రాజ‌కీయాల్లోకి రావాల‌ని నిర్ణ‌యించుకున్నాన‌ని, అయితే తాను సూచించిన డిమాండ్ల‌కు ఏ పార్టీ అయితే ఓకే అంటుందో... ఆ పార్టీలోనే చేర‌తాన‌ని చెప్పి అలీ అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేశాడు. సినీ న‌టుడిగానే ఉన్నా... చాలా కాలం నుంచి అలీ అధికార టీడీపీకి సానుభూతిప‌రుడిగా ఉన్నారు. క్రియాశీల కార్య‌క‌ర్త‌గా కాకున్నా... అవ‌స‌రం ఉన్న‌ప్పుడ‌ల్లా పార్టీలో క‌నిపిస్తూ వ‌స్తున్నాడు. అయితే.. త్వ‌ర‌లో ఏపీ అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో అలీ త‌న రాజ‌కీయ రంగ ప్ర‌వేశం గురించి చాలా సీరియ‌స్‌గా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో మొన్న‌టికి మొన్న విప‌క్ష నేత‌, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో క‌లిసి కూర్చున్న అలీ ఫొటోలు నెట్ లో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాయి. దీంతో ఒక్క‌సారిగా అలీ వైసీపీలో చేరిపోతున్నాడ‌ని, అందుకే జ‌గ‌న్‌తో భేటీ అయ్యాడ‌ని వార్త‌ల‌తో పాటు జ‌గ‌న్‌, అలీ క‌లిసి ఉన్న ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.

అయితే ఈ వార్త‌లు స‌ద్దుమ‌ణగక ముందే... విజ‌య‌వాడ‌లో ప్ర‌త్య‌క్ష‌మైన అలీ... టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడితో భేటీ అయ్యారు. అరగంట పాటు జరిగిన ఈ భేటీ ముగియ‌గానే... అటు నుంచే అటే విజ‌య‌వాడ‌లోనే ఉన్న ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌ద్ద‌కూ వెళ్లి... సినీ ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కు అత్యంత ముఖ్యుడు అయిన జ‌న‌సేనానితో దాదాపుగా రెండు గంట‌ల పాటు సుదీర్ఘ చ‌ర్చ‌లు జ‌రిపారు. దీంతో అలీ వ్య‌వ‌హారం ఏ ఒక్క‌రికీ అంతుబ‌ట్ట‌లేదు. తాజాగా నేడు విశాఖ వెళ్లిన అలీ... అక్క‌డి స్థానిక టీడీపీ నేత‌ - ఏపీ మంత్రి గంటా శ్రీ‌నావాస‌రావుతో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా గంటాతో త‌న‌కున్న స‌త్సంబంధాల నేప‌థ్యంలోనే ఈ భేటీ జ‌రిగింద‌ని, దీనికేమీ పెద్ద ప్రాధాన్యం కూడా ఏమీ లేద‌ని తొలుత అలీ బుకాయించాడు.

అయితే ఓ మీడియా ప్ర‌తినిధి మ‌రీ గుచ్చి గుచ్చి అడిగితే... అలీ అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టేశారు. విశ్వ‌స‌నీయంగా అందిన ఈ వివ‌రాల మేర‌కు... రాష్ట్రంలోని మూడు పార్టీల వ‌ద్ద అలీ కొన్ని డిమాండ్లు పెట్టాడ‌ట‌. ఆ డిమాండ్లు ఏమిటంటే... వ‌చ్చే ఎన్నిక‌ల్లో గుంటూరు అసెంబ్లీ టికెట్ ఇవ్వ‌డంతో పాటుగా పార్టీ అధికారంలోకి వ‌స్తే... ఏకంగా మంత్రి ప‌ద‌వికి కూడా ఇవ్వాల్సిందేన‌ని అలీ ష‌ర‌తు పెట్టాడ‌ట‌. ఈ డిమాండ్ల‌ను ఏ పార్టీ అయితే ఒప్పుకుంటుందో... అదే పార్టీలో చేర‌తాన‌ని కూడా అలీ చెప్పుకొచ్చాడు. టీడీపీలో ఉన్నానంటూనే త‌న డిమాండ్ల‌ను నెర‌వేర్చే పార్టీకే ఓటు అంటూ అలీ చెబుతున్న మాట‌లు వింటుంటే... ప్ర‌స్తుతం రాజ‌కీయాల్లో ఉన్న ముదురు నేత‌ల కంటే కూడా అలీ బాగానే ముదిరిపోయాడ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.


Full View

Tags:    

Similar News