అలహాబాద్ హైకోర్టు క్లియర్ గా చెప్పిన మాటను సుప్రీం కూడా చెప్పేస్తే బాగుండు

Update: 2022-08-01 04:35 GMT
కరోనా బారిన పడిన పలువురు పెద్ద ఎత్తున ఆసుపత్రుల్లో చేరటం తెలిసిందే. అయితే.. ట్రీట్ మెంట్ కోసం ఆసుపత్రుల్లో చేరిన కరోనా పేషెంట్లలో పలువురు మరణించటం తెలిసిందే. మొదటి.. రెండు.. మూడు వేవ్ ల్లో ఎక్కువ మంది రెండో వేవ్ వేళ మరణించటం తెలిసిందే. ఆసుపత్రి ప్రాంగాణల్లో సరైన సమయానికి వైద్యం అందక ప్రాణాలు విడిచిన వైనం.. దానికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ మరణాల్ని అటు ప్రభుత్వాలు ఇటు బీమా సంస్థలు కొన్ని కరోనా ఖాతాలో వేయటానికి ససేమిరా అనే పరిస్థితి.

బీమా కంపెనీల సంగతిని పక్కన పెడితే.. ప్రభుత్వాలు ఈ మరణాలపై దారుణమైన రీతిలో రియాక్టు కావటం కనిపిస్తుంది. అధికారిక లెక్కల్లో కరోనా మరణాలకు బదులుగా.. వారికి సంబంధించిన ఇతర ఆరోగ్య సమస్యల్ని చూపిస్తూ.. కరోనా మరణాలుగా డిక్లేర్ చేసేందుకు నో అంటే నో అనేసిన పరిస్థితి. దీనికి సంబంధించిన అభ్యంతరాలు పెద్ద ఎత్తున వచ్చినా ప్రభుత్వాలు తమ తీరును మార్చుకున్నది లేదు. ఇలాంటి వేళ.. కరోనా బారిన పడి ఆసుపత్రిలో మరణించిన వ్యక్తి గుండె పోటుతో మరణించినా.. మరే అవయువ ఫెయిల్యూర్ కారణంగా చనిపోయినా దాన్ని కరోనామరణంగానే పరిగణించాలని తాజాగా అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది.

2021 యూపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల విధుల్లో పాల్గొన్న పలువురు ప్రభుత్వ ఉద్యోగులు కరోనా బారిన పడి మరణించారు. వారికి ఇచ్చే పరిహారానికి సంబంధించి 2021 జూన్ ఒకటిన యూపీ సర్కారు ఒక జీవో జారీ చేసింది. దాని ప్రకారం కరోనా కారణంగా మరణించిన కుటుంబాలకు రూ.30 లక్షల వరకు పరిహారం వస్తుంది. అయితే.. కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా ఆసుపత్రిలో చేరి.. 30 రోజుల్లో మరణిస్తేనే కొవిడ్ మరణంగా భావించి.. పరిహారం ఇవ్వనున్నట్లుగా ఆ జీవోలో పేర్కొన్నారు. ఒకవేళ ఎవరైనా 30 రోజుల తర్వాత మరణిస్తే.. వారికి పరిహారం ఇచ్చేందుకు అధికారులు నో అనే పరిస్థితి.

ఇలాంటివేళ.. కరోనాతో ఆప్తుల్ని కోల్పోయిన పలువురుకలిసి ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూ..అలహాబాద్ హైకోర్టును సంప్రదించారు. ఇందులో ఒక పిటిషనర్ తన భర్త కరోనా కారణంతో మరణించినట్టుగా అధికారులు కూడా అంగీకరిస్తున్నారని.. కానీ నిబంధనల కారణంగా పరిహారం ఇవ్వటానికి నో చెబుతున్నట్లుగా పేర్కొన్నారు. కరోనా బారిన పడిన కొందరు 30 రోజుల తర్వాత కూడా మరణిస్తున్నారన్న విషయాన్ని కోర్టు ద్రష్టికి తీసుకొచ్చారు.

దీనిపై స్పందించిన అలహాబాద్ హైకోర్టు స్పందిస్తూ.. అలాంటి వారికి 9 శాతం సాధారణ వడ్డీతో సహా పరిహారాన్ని చెల్లించాలని తాజాగా ఆదేశించింది. కొవిడ్ ఇన్ఫెక్షన్ కారణంగా గుండె.. ఊపిరితిత్తులు లాంటి అవయువాల మీద ప్రభావం పడి.. మరణానికి దారి తీసే ప్రమాదం ఉందన్న విషయాన్ని కోర్టు గుర్తు చేసింది.

అలాంటి వాటి మరణాలన్నింటిని కరోనా మరణాలుగా పరిగణలోకి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. ఇదే మాటను సుప్రీంకోర్టు కూడా గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే.. కరోనాతో మరణిస్తే.. దానికి ఏదో కారణం చూపించి.. ఆయా అవయువం పని చేయని కారణంగా మరణించినట్లుగా పేర్కొంటూ ప్రభుత్వం గణాంకాల్లో చెబుతున్న వేళ.. ఈ పరిస్థితిని మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News