కేసీఆర్ కు ‘‘సుపరిపాలన వేదిక’’ షాక్

Update: 2016-07-20 04:55 GMT
ఉద్యమాలు ఎందుకు పుడతాయి? ఎలా పుడతాయి? వాటి కారణంగా ప్రజల్లో వచ్చే స్పందన ఏమిటి? దాని కారణంగా రాజకీయ పరిణామాలు ఎలాంటి మార్పులు చేర్పులకు గురి అవుతాయి? లాంటి ప్రశ్నలకు సమాదానాలు తెలంగాణ మొత్తంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలిసినంత బాగా మరెవరికీ తెలీదనటంలో సందేహం లేదు. రాజకీయ నాయకుడిగా.. ఉద్యమనేతగా ఆయనకున్న విలక్షణమైన పోర్ట్ పోలియో సమకాలీన రాజకీయాల్లో మరే అధినేతకూ లేదనే చెప్పాలి. మరి.. ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉద్యమాలు తెర మీదకు రాకుండా.. ప్రభుత్వం మీద విమర్శలు వచ్చే వీల్లేకుండా పాలన చేయలేరా? అన్న సందేహం కలగక మానదు.

అయితే.. ఆశకు అత్యాశ తోడైతే ఎంతటి నాయకుడికైనా తిప్పలు తప్పవన్న సూత్రం కేసీఆర్ కు అప్లై అవుతుందనే చెప్పాలి. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయాలని భావిస్తున్న 15 జిల్లాల మీదా రచ్చ మొదలైంది. ఇప్పటివరకూ ఈ అంశం మీద పెద్దగా గొంతులు విప్పకున్నా తాజాగా సుపరిపాలన వేదిక మాత్రం తీవ్రంగా ఖండించింది.

సరైన అధ్యయనం లేకుండా మేధావులు.. ప్రజల అభిప్రాయాల్ని తీసుకోకుండా ఒకేసారి 15 జిల్లాల పెంపు తొందరపాటు చర్యగా సదరు వేదిక అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కాంట్రాక్టర్లు.. రియల్ వ్యాపారులు.. రాజకీయ నాయకులు.. దళారులకు మాత్రమే ప్రయోజనం కలిగించేలా ప్రస్తుతం కొత్త జిల్లాల ఏర్పాటు ఉందన్న మాట ఈ వేదిక వినిపించటం ఇప్పుడు అందరి దృష్టి పడేలా చేస్తుందని చెప్పాలి.

కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రభుత్వం మీద భారీ ఆర్థికభారం పడుతుందని వారు చెబుతున్నారు. ఇప్పటికే పాలన కోసం బడ్జెట్ లో 75 శాతం ఖర్చు చేస్తున్నారని.. ఇక కొత్త జిల్లాల ఏర్పాటుతో ఈ ఖర్చు మరింత పెరుగుతుందన్న వాదనను తెరపైకి తెస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై కలిగే ప్రయోజనాలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయొచ్చుగా అంటూ వారు సంధిస్తున్న ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News