ఆమెను చూస్తే.. న‌డ‌క రాని వారు సైతం.. నేను సైతం.. అన‌రా!

Update: 2022-10-18 13:30 GMT
ఏపీ రాజ‌ధానిగా అమమ‌రావ‌తినే ఉంచాల‌ని.. దానినే డెవ‌ల‌ప్ చేయాల‌నే ఏకైక డిమాండ్‌తో రాజ‌ధాని రైతులు.. నిరాటంకంగా.. ప్ర‌భుత్వంపై  పోరాడుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో అనేక ఉద్య‌మాలు చేశారు. అనేక మందిపై కేసులు పెట్టినా వెన‌క్కి త‌గ్గ‌లేదు. కేంద్రానికి మొర‌పెట్టుకున్నారు. న్యాయ‌స్థానాన్ని కూడా ఆశ్రయించారు.

ఇక‌, ఇప్పుడు రాష్ట్రంలోని ప్ర‌జ‌ల‌ను స‌మైక్య ప‌రిచేందుకు.. త‌మ గోడు వినిపించేందుకు న‌డుంబిగించారు. ఈ క్ర‌మంలోనే ఇప్ప‌టికే తొలి ద‌ఫా న్యాయ‌స్థానం నుంచి దేవ‌స్థానం పేరిట పాద‌యాత్ర చేశారు. వృద్ధులు.. వికలాంగులు.. మ‌హిళ‌లు.. యువ‌తులు ఇలా అన్నివ‌ర్గాల వారు రాజ‌ధానికోసం.. త‌మ గ‌ళం వినిపిస్తున్నారు.

తాజాగా అమ‌రావతి నుంచి అర‌స‌వ‌ల్లి వ‌ర‌కు నిర్వ‌హిస్తున్న పాద‌యాత్ర‌లో మ‌న‌సు క‌రిగించే ఘ‌ట‌న చిత్రం రూపంలో తెలుగు ప్ర‌పంచాన్ని చుట్టేస్తోంది. రాజ‌ధానిపై విమ‌ర్శ‌లు చేసే వారు.. రాజ‌ధానిరైతుల‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించే వారి చెంప ఛెళ్లు మ‌నిపించేలా.. ఉన్న ఆ `చిత్రం` అంద‌రి హృద‌యాల‌ను క‌రిగిస్తోంది.

విష‌యం ఏంటంటే.. ప్ర‌స్తుతం ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లాలో సాగుతున్న పాద‌యాత్ర‌లో వృద్ధులు.. మ‌హిళ‌లు అంద‌రూ న‌డుస్తున్నారు. త‌మ ఆకాంక్ష‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఏకైక రాజ‌ధాని కోసం.. త‌మ భూములు ఇచ్చామ‌ని... ఇప్పుడు తాము రోడ్డున ప‌డ్డామ‌ని వారు చెబుతున్నారు.

ఇలా వారి వెంట న‌డుస్తున్న వారిలో ఒక మ‌హిళ అంద‌రినీ ఆక‌ర్షించింది. ఆవిడ‌లో అమ‌రావ‌తి ప‌ట్ల మ‌క్కువ‌, రాజ‌ధాని పై ఉన్న ఆకాంక్ష చెప్ప‌క‌నే చెబుతున్నాయి. ఆవిడ‌.. నిండు గ‌ర్భిణి.. క‌డుపులో ప‌సిన‌లుసు.. చేతిలో మ‌రో చిన్నారి.. మ‌రో చేతిలో వాట‌ర్ బాటిల్., నడ‌వ‌లేక న‌డుస్తున్న తీరు.. అయినా.. మొక్క‌వోని దీక్ష‌! నిజానికి కాల్లో ముల్లు గుచ్చుకుంటేనే అమ్మో అయ్యో.. అని అడుగు తీసి అడుగు వేయ‌లేం క‌దా.. కానీ.. ఆమె క‌డుపులో పసికూన‌ను మోస్తూ.. మ‌రో చేత్తో.. చిన్నారిని ప‌ట్టుకుని అడుగులో అడుగు వేసుకుంటూ.. పాద‌యాత్ర‌లో ముందుకు సాగుతున్నారు. ``ఆమెను చూస్తే.. న‌డ‌క రాని వారు సైతం.. నేను సైతం.. అంటూ.. పాద‌యాత్ర‌లో పాదం క‌డ‌ప‌కుండా ఉండ‌లేరు!`` ప్ర‌స్తుతం ఈ చిత్రం జోరుగా వైర‌ల్ అవుతుండ‌డం గ‌మ‌నార్హం.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News