చిన‌బాబు కోసం త్యాగాల‌కు ఆ ఇద్ద‌రు మంత్రులు రెఢీ

Update: 2018-01-23 04:41 GMT
తొక్క‌లో సీటుదేముంది? అధినేత ఆశీస్సులు ఉండాలే కానీ.. సీటుకు మించి సాధించుకోవ‌చ్చ‌న్నట్లుగా ఉంది ఏపీ మంత్రుల వ్య‌వ‌హారం. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు రాజ‌కీయ వార‌సుడిగా పేరు ప్ర‌ఖ్యాతుల్ని సొంతం చేసుకున్న చిన‌బాబు అలియాస్ లోకేశ్ కోసం సీట్లు త్యాగాలు చేసేందుకు తెగ పోటీ ప‌డి పోతున్నారు ఏపీ మంత్రులిద్ద‌రు. త‌మ సీటు తీసుకోవాలంటే త‌మ సీటు తీసుకోవాలంటూ పోటాపోటీగా ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌లు ఇస్తున్నారు.

ఫ్యూచ‌ర్ లీడ‌ర్ ను ముందే మ‌చ్చిక చేసుకోవాల‌నుకున్నారో కానీ.. లోకేశ్ కానీ ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలో దిగాల‌ని భావిస్తే మాత్రం త‌మ నియోజ‌క‌వ‌ర్గాన్ని లోకేశ్‌కు అప్ప‌జెబుతామ‌ని చెబుతున్నారు మంత్రులు గంటా.. అమ‌రనాథ్ రెడ్డిలు. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర్లోనే ఉన్నాయ‌ని.. ఈ ఏడాది చివ‌ర్లోనే జ‌రిగే వీలుంద‌న్న మాట‌ను సాక్ష్యాత్తు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు చెప్పిన నేప‌థ్యంలో.. ఎన్నిక‌ల వేడి పార్టీలో మొద‌లైంది.

రెండు రోజుల క్రితం జ‌రిగిన టీడీపీ రాష్ట్ర స్థాయి వ‌ర్క్ షాప్ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా లోకేశ్ ఎక్క‌డ నుంచి బ‌రిలోకి దిగుతార‌న్న చ‌ర్చ‌పార్టీలో జోరుగా సాగుతోంది. ఈ సంద‌ర్భంగా మంత్రుల నుంచి చిన‌బాబుకు బంప‌ర్ ఆఫ‌ర్ వ‌చ్చింది. ఏపీ శాస‌న మండ‌లి చీఫ్ విప్ ప‌య్యావుల కేశవ్‌.. మంత్రి అమ‌ర్ నాథ్ రెడ్డి ల మ‌ధ్య సాగిన చ‌ర్చ‌లో లోకేశ్‌ కు ఇంట్ర‌స్ట్ ఉంటే తాను పుంగ‌నూరు నుంచి పల‌మ‌నేరు నుంచి పోటీ చేస్తాన‌ని అమ‌ర్ నాథ్ రెడ్డి ప్ర‌తిపాదించారు. తాను సైతం త‌న సీటును త్యాగం చేస్తాన‌ని ప‌య్యావుల చెప్పారు.

వీరిద్ద‌రికి ఏమాత్రం త‌గ్గ‌ని రీతిలో మంత్రి గంటా రియాక్ట్ అయ్యారు. ఒక‌వేళ చిన‌బాబు కానీ కోరుకుంటే తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న భీమిలి నియోజ‌క‌వ‌ర్గాన్ని వ‌దులుకోవ‌టానికి సిద్ధ‌మ‌ని చెప్పారు. ఆ మ‌ధ్య‌న ఏపీ ఎమ్మెల్సీగా ఎన్నికై.. అనంత‌రం ఐటీ.. పుర‌పాలక సంఘ మంత్రిగా బాధ్య‌త‌ల్ని చేప‌ట్టారు లోకేశ్‌. మ‌రో నాలుగేళ్లు ఆయ‌న ప‌ద‌వీ కాలం ఉంది.

ఈ నేప‌థ్యంలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలో దిగుతారా?  లేదా?  అన్న అంశంపై క్లారిటీ లేదు. అయిన‌ప్ప‌టికీ.. మంత్రులు ఎవ‌రికి వారు తాము ప్రాతినిధ్యం వ‌హిస్తున్న అసెంబ్లీ స్థానాన్ని చిన‌బాబు కోసం త్యాగం చేస్తామ‌ని చెబుతున్నారు. అదే స‌మ‌యంలో వేరే నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తామ‌ని చెప్ప‌టం చూస్తే.. ఒక దెబ్బ‌కు రెండు పిట్ట‌ల‌న్న సూత్రాన్ని తెలుగు త‌మ్ముళ్లు ప‌క్కాగా పాటిస్తున్న‌ట్లుగా క‌నిపించ‌క మాన‌దు. సీటు త్యాగం ముచ్చ‌ట చిన‌బాబు దృష్టికి వెళితే త‌మ ఫ్యూచ‌ర్ మ‌రింత బ్రైట్ గా ఉంటుంద‌న్న త‌మ్ముళ్ల ఆశ‌పై లోకేశ్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Tags:    

Similar News